నంబీ నారాయణ్‌కు పద్మపురస్కారమా? షాకింగ్‌..!

Kerala Fomer DGP expresses Shock on Padma to Nambi Narayanan - Sakshi

తిరువనంతపురం: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయణ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించడంపై కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ అంతరిక్ష పరిశోధన రహస్యాలను విదేశాలకు అమ్మేందుకు ప్రయత్నించారంటూ 1990లో క్రయోజనిక్‌ నిపుణుడైన నంబీ నారాయణ్‌ అభియోగాలు ఎదుర్కొన్నారు. ఇస్రోను కుదిపేసిన ఈ గూఢచర్య కేసులో నంబీతోపాటు మరో శాస్త్రవేత్త అయిన డీ శశికుమార్‌ అరెస్టయ్యారు. మాల్దీవులకు చెందిన మహిళలతో ఉండగా వారిని 1994లో అరెస్టు చేశారు. ఈ కేసు నుంచి పూర్తిగా నంబీ నారాయణ్‌ బయటపడకముందే ఆయనకు పద్మ పురస్కారాన్ని ఎలా ప్రకటిస్తారని మాజీ డీజీపీ సేన్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘ఏ ప్రాతిపదికన ఆయనకు అవార్డు ఇచ్చారో అర్థం కావడం లేదు. తేనెలో విషం కలిపిన చందంగా ఇది ఉంది. ఇస్రో గూఢచర్య కేసులో సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ విచారణ జరుపుతున్న దశలో అతని పేరును అవార్డుకు ఎలా పరిగణనలోకి తీసుకున్నారు’ అని సేన్‌కుమార్‌ ప్రశ్నించారు. ఆయన పేరును ప్రతిపాదించిన వ్యక్తులు మున్ముందు దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నిజాయితీపరుడైన ఐపీఎస్‌గా పేరొందిన సేన్‌కుమార్‌ మూడేళ్ల కిందట డీజీపీ పదవి నుంచి తనను పినరయి విజయన్‌ ప్రభుత్వం తొలగిస్తే.. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడి పదవిని తిరిగిపొందారు.

ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘నంబీ నారాయణ్‌ దేశానికి చేసిన సేవలేమిటి? ఆయనో మామూలు శాస్త్రవేత్త. ఇస్రో నుంచి స్వయంగా తప్పుకున్నాడు. ఆయనకు బదులు ఓ యువ శాస్త్రవేత్తకు ఈ పురస్కారం అందజేసి ఉంటే నేను సంతోషించి ఉండేవాడిని’ అని అన్నారు. ఇస్రో గూఢచర్యం కేసును ఇప్పటికీ సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు తనకు పద్మభూషణ్‌ పురస్కారం దక్కడంపై నంబీ నారాయణ్‌ సంతోషం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు బూటకమని, తాను అమాయకుడినని చాటడానికి ఈ పురస్కారమే నిదర్శనమన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top