
న్యూఢిల్లీ: కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన కావేరీ నదీ జలాల విషయాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ముందడుగేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కావేరీ నదీజలాల యాజమాన్య సంస్థ (సీఎంఏ)ను శుక్రవారం ఏర్పాటుచేసింది. ఈ సంస్థ చైర్మన్, సభ్యులను నియమించనప్పటికీ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర జలవనరుల శాఖ వెలువరించింది. సీఎంఏలో చైర్మన్, సెక్రటరీతో పాటుగా ఎనిమిది మంది సభ్యులుంటారు.
ఇందులో కేంద్రం తరపున ఇద్దరు శాశ్వత, ఇద్దరు తాత్కాలిక సభ్యులు, భాగస్వామ్య రాష్ట్రాల నుంచి నలుగురు తాత్కాలిక సభ్యులు ఉంటారు. చైర్మన్‌గా జలవనరుల నిర్వహణలో అనుభవమున్న సీనియర్ ఇంజనీర్ లేదా ఈ రంగంలో అనుభవమున్న ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. కమిటీ కావేరీ నదీ జలాల నిల్వ, పంపకం, వివాదాల పరిష్కారం తదితర వివాదాలను సమీక్షించి ఆదేశాలిస్తుంది. కావేరీ జలాల్లో కర్ణాటక వాటాను పెంచి.. తమిళనాడు వాటాను సుప్రీంకోర్టు స్వల్పంగా తగ్గించిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయంపై తమిళనాడు సీఎం పళనిస్వామి హర్షం వ్యక్తం చేశారు.