బీహార్లో అధికార పక్షమైన జేడీయూ బీజేపీ చేస్తున్న రాజకీయ ఎత్తుగడలను ఎండగడుతూ శుక్రవారం ఎదురుదాడికి దిగింది.
పాట్నా: బీజేపీ రాజకీయ ఎత్తుగడలను ఎండగడుతూ బీహార్లో అధికార పక్షమైన జేడీయూ శుక్రవారం ఎదురుదాడికి దిగింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాజిక కార్యకర్త అయిన కర్పూరీ ఠాకూర్ పేరును వాడుకుంటూ బీజేపీ ప్రచారాలు చేసుకుంటోందని జేడీయూ నేత, నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడైన శ్యాం రజాక్ విమర్శించారు. బీజేపీ వార్షికోత్సవ మహాసభల్లో ఠాకూర్ ఫొటోలతో ఉన్న ప్లెక్సీలు కనిపించాయని ఆయన అన్నారు.
బీజేపీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెడుతోందని, కానీ కర్పూరీ ఠాకూర్ పేదల ఆశాజ్యోతి అనే విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని రజాక్ అన్నారు. జీవితాంతం పేదరికంలోనే గడిపిన ఠాకూర్ లాంటి వ్యక్తిని... కార్పొరేట్ వ్యక్తుల మద్దతుతోనే ఎదిగిన అమిత్ షా లాంటివాళ్లు పొగడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
భారతరత్న అవార్డు ఇవ్వటంలో ఠాకూర్ను మరచిన మోదీ సర్కారు.. ఇప్పుడు ఎందుకు ఆయన గురించి పట్టించుకుంటోందని ప్రశ్నించారు. వాజ్ పేయికి భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతించిన నితీశ్ కుమార్.. ఠాకూర్ విషయాన్ని కూడా బలంగా ప్రస్తావించారని ఆయన గుర్తుచేశారు. కేవలం బాగా వెనకబడిన కులాలు (ఈబీసీ)లను బీజేపీ కేవలం ప్రచారం కోసమే వాడుకుంటోందని రజాక్ విమర్శించారు.