
అగర్తలా : త్రిపుర రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ ఘట్టం చోటు చేసుకుంది. జాతీయ గీతం జన గణ మనను రాష్ట్ర అసెంబ్లీలో తొలిసారిగా ప్రదర్శించారు.
శుక్రవారం ఉదయం స్పీకర్ పదవి కోసం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొటెం-స్పీకర్‌గా వ్యవహరించిన రతన్ చక్రవర్తి తన స్థానానికి రాగానే జన గణ మనను ప్రదర్శించారు. ఆ సమయంలో సభలో ఉన్న సభ్యులు, అధికారులు, పాత్రికేయులు అంతా నిల్చుని గౌరవించారు. తర్వాత జరిగిన ఎన్నికలో రెబతీ మోహన్ దాస్‌ను స్పీకర్‌గా ఎన్నుకున్నారు.
‘దేశంలోని ఇతర రాష్ట్రాల శాసన సభల్లో జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తారో లేదో? నాకు తెలీదు,కానీ, ఇకపై మాత్రం రోజూ జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తాం అని అసెంబ్లీ కార్యదర్శి బామ్‌దేవ్ మజుందార్ వెల్లడించారు. అయితే ప్రతిపక్ష కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమను సంప్రదించకుండానే ఏపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ సీపీఎం పార్టీ నేత బాదల్ చౌదరి చెబుతున్నారు.