సింధీలు కూడా మనకు అంటరాని వారేనా!

Sindhis Contribution In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సింధీలను భారతీయుల నుంచి ఎవరు వేరు చేయలేరు. నేడు వారు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడ్డా తాము భారతీయులమనే గర్వంగా చెప్పుకుంటారు. వారు పుట్టింది పాకిస్థాన్‌లోని సింధ్‌ రాష్ట్రమైనా వారు పెరిగిందీ, ప్రేమించిందీ భారత్‌నే. భారతీయ సంస్కృతి సంప్రదాయాలనే. దేశ విభజన సందర్భంగా పాక్‌ పాలకులు వారిని తరిమికొడితే మనమేమి వారిని అక్కున చేర్చుకోలేదు. అప్పటికీ అంతగా అభివృద్ధి చెందని భారత్‌కు వారు బరువేనంటూ భరించామంతే. దేశ స్వాతంత్య్ర పోరాటంలో వారిది కూడా వీరోచిత పాత్ర  ఉండడం అందుకు కారణం కావచ్చు.

స్వార్థపరులు, అవకాశవాదులంటూ మనం ఎన్ని విధాలుగా వారిని అవమానించినా వాటిని వారు పట్టించుకోకుండా భారత్‌లో అన్ని రంగాల్లో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య రంగాల్లో బాగా రాణించారు. అప్పటికీ వారు సామాజికంగా వెనకబడి ఉన్నప్పటికీ విద్యా, ఉపాధి రంగాల్లో ఏనాడు రిజర్వేషన్లు కావాలంటూ డిమాండ్లు చేయలేదు. వారి కోసం వారు స్వయంగా విద్యాలయాలను, వైద్యాలయాలను, హోటళ్లను ఏర్పాటు చేసుకున్నారు. తోటి భారతీయుల పట్ల వారు ధాతృత్వం కూడా చాటుకున్నారు. అయినా మనం పట్టించుకోలేదు.

దేశంలోని ఇతర ప్రాంతాలకన్నా చాలా ఆలస్యంగా, అంటే 1843లో సింధు రాష్ట్రం బ్రిటీష్‌ పాలన కిందకు వచ్చింది. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంగా దేశంలోని జైళ్లన్నీ నిండిపోయాయి. అప్పుడూ సింధూ ప్రాంతమంతటా బ్రిటీష్‌ పాలకులు మార్షల్‌ లా ప్రకటించారు. ప్రముఖ సింధీ పత్రిక ‘హిందూ’ (నేటి ఇంగ్లీషి పత్రిక ‘ది హిందూ’ కాదు) పోషించిన ప్రముఖ పాత్రను కూడా మనం విస్మరించాం. 1921లో భారత జాతిపిత మహాత్మా గాంధీ ఈ పత్రిక ప్రారంభించారు.

దేశ స్వాతంత్య్రం కోసం విస్తృతతంగా ప్రచారం చేస్తున్న ఈ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు హిరానంద్‌ కర్మచంద్‌ మఖీజానిని 1942లో బ్రిటీష్‌ పాలకులు  అరెస్ట్‌ చేసి ప్రింటింగ్‌ ప్రెస్‌ను మూసివేశారు. ఆ తర్వాత మరో చోటు నుంచి ఈ పత్రిక ప్రచురణ మొదలయింది. మళ్లీ ఎడిటర్‌ను అరెస్ట్‌ చేసి పత్రికను మూసివేశారు. ఓ చోట ఎడిటర్‌ను అరెస్ట్‌చేసి ప్రెస్‌ను మూసివేస్తే మరోచోటు నుంచి మరో ఎడిటర్‌ ఆధ్వర్యంలో పత్రిక పుట్టుకొచ్చేది. ఇలా దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఏడుగురు ఎడిటర్లు అరెస్ట్‌ అయ్యారు.

19 ఏళ్ల సింధీ యువకుడు హేము కలానీ త్యాగాన్ని కూడా మన చరిత్రకారులు అంతగా పట్టించుకున్నట్లు లేదు. స్వాతంత్య్ర కార్యకలాపాల్లో క్రి యాశీలకంగా పాల్గొంటున్నారన్న ఆరోపణలపై ఆ యువకుడిని బ్రిటీష్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. యువకుడికి క్షమాభిక్ష పెట్టాలంటూ సింధీలంతా అప్పటికీ బ్రిటీష్‌ వైస్రాయ్‌కి ఓ అర్జి పెట్టుకున్నారు. అందుకు ఆయన ఓ షరతు విధించారు. తోటి కార్యకర్తల గురించి సమాచారం అందిస్తే కలానీ విడుదల చేస్తామన్నది ఆ షరతు. అందుకు ఆ యువకుడు ససేమిరా అంగీకరించలేదు. దాంతో సింధూ రాష్ట్రంలోని సుక్కూర్‌ జైల్లో ఆ యువకుడిని ఉరి తీశారు.

దేశంలో ప్రసిద్ధి చెందిన గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవును సింధీ వ్యాపారి భాయ్‌ ప్రతాప్‌ ఏర్పాటు చేశారు. కాండ్లా ఓడ రేవు పేరును గతేడాది సెప్టెంబర్‌ 25వ తేదీనే దీన్‌ దయాళ్‌ రేవుగా మార్చిన విషయం తెలిసిందే. రేవుకు దీన్‌ దయాళ్‌కు ఎలాంటి సంబంధం లేదన్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే దేశ జాతీయ గీతం ‘జన గణ మన అధి నాయక జయహే’లో నుంచి ‘సింధు’ పదాన్ని తొలగించాలని, ఆ స్థానంలో ఈశాన్య భారతాన్ని సూచించాలంటూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రిపున్‌ బోరా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కారణం. మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టి జాతీయ గీతం నుంచి ఈ ‘సింధు’ అనే పదాన్ని తొలగించవచ్చేమోగానీ, సింధీల మది నుంచి భారత్‌ను, భారతీయతను తొలగించలేరన్నది సత్యము.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top