‘వెల్‌నెస్‌’ కూడబెట్టింది..రూ.500 కోట్లకు పైనే

IT Rides On Spiritual Teachers Ashram - Sakshi

ఓ ఆధ్యాత్మిక గురువు ఆశ్రమంపై దాడులు కొనసాగుతున్నాయి...ఐటీ దాడులపై ఆర్థిక శాఖ ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ: ‘వెల్‌ నెస్‌’కోర్సుల పేరుతో ఆస్తులు కూడగడుతున్న ఓ ఆశ్రమంపై గడిచిన మూడు రోజులుగా జరిగిన ఐటీ దాడుల్లో దాదాపు రూ. 500 కోట్లకు పైగా వెల్లడించని ఆస్తులు వెలుగు చూశాయని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఏకత్వం’అనే తత్వంతో ఓ ఆధ్యాత్మిక గురువు 1980లో స్థాపించిన ఒక ట్రస్టు ‘వెల్‌నెస్‌’కోర్సుల పేరిట తత్వశాస్త్రం, ఆధ్యాత్మికం తదితర అంశాల్లో శిక్షణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని వరదయ్యపాలెం, చెన్నై, బెంగళూరు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందనీ..ఈ సంస్థపై దాడులు, దర్యాప్తు కొనసాగుతోందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇందులో ఎక్కడా ఆశ్రమం ఎవరిదనే అంశాన్ని ప్రస్తావించలేదు.కల్కి భగవాన్‌ ఆశ్రమంపై ఐటీ దాడులు జరుగుతున్నాయని రెండు రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ సంస్థ పేరు ఈ ప్రకటనలో ప్రస్తావించలేదు.

ఓ ఆధ్యాత్మిక గురువు అంటూ ప్రకటన మొదలైంది. ‘1980 లలో ‘ఏకత్వం‘అనే తత్వంతో ఓ ఆధ్యాత్మిక గురువు స్థాపించిన ఈ గ్రూపు క్రమంగా దేశ, విదేశాల్లో రియల్‌ ఎస్టేట్, నిర్మాణం, క్రీడలు మొదలైన అనేక రంగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం ఈ గ్రూపును ఆ ఆధ్యాత్మిక గురువు, అతని కుమారుడు నిర్వహిస్తున్నారు. విదేశీయులు ఈ కోర్సుల్లో చేరడం ద్వారా ఈ గ్రూపు విదేశీ మారక ద్రవ్యాన్నీ సంపాదించింది. ఈ సొమ్మును ఏపీ, తమిళనాడుతో పాటు విదేశాల్లోనూ పెట్టుబడులుగా పెట్టింది.

చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వరదయ్యపాలెం తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 40 చోట్ల దాడులు జరిగాయి. ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఆస్తుల అమ్మకాల ద్వారా కాగితాలపై ఉన్న విలువ కంటే అదనంగా సొమ్మును నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు లభించాయి. 2014–15 నుంచి లెక్క చూపని ఇలాంటి నగదు రూ. 409 కోట్లుగా ఉన్నట్టు ఐటీ విభాగం అంచనా వేసింది. ఇక లెక్క చూపని నగదు, ఇతర విలువైన వస్తువులు ఈ గ్రూపు వ్యవస్థాపకుడు, అతని కుమారుడి ఇళ్లల్లో, ప్రాంగణాల్లో లభించాయి. రూ. 43.9 కోట్ల మేర నగదును ఐటీ విభాగం స్వాధీనంచేసుకుంది.

ఇవి కాకుండా విదేశీ నగదును సీజ్‌ చేసింది. దీని విలువ రూ. 18 కోట్లు. అలాగే రూ. 26 కోట్ల విలువ చేసే 88 కిలోల బంగారాన్నీ సీజ్‌ చేసింది. రూ. 5 కోట్ల విలువ గల 1,271 కేరట్ల వజ్రాలనూ సీజ్‌ చేసింది. వీటికీ లెక్కలు లేవు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ రూ. 93 కోట్లు. లెక్కా పత్రం లేని, వెల్లడించని ఆస్తుల విలువ దాదాపు రూ. 500 కోట్లకు పైబడి ఉంటుంది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి..’అని పేర్కొంది.

విదేశాలకు మళ్లింపు..
తనిఖీల్లో వెల్లడైన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గ్రూపు దేశ, విదేశాల్లో..ప్రధానంగా పన్ను పోటు లేని దేశాలకు చెందిన కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. చైనా, యుఎస్‌ఎ, సింగపూర్, యుఎఇ, తదితర దేశాల్లో ఏర్పాటు చేసిన ఈ కంపెనీలు.. భారతదేశంలో అందించే వివిధ ‘వెల్‌ నెస్‌’కోర్సులకు హాజరయ్యే విదేశీ ఖాతాదారుల నుంచి ఫీజులు అందుకున్నట్టు ఐటీ విభాగం తనిఖీల్లో వెలుగుచూసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top