గ‘ఘన’ విజయ వీచిక

ISRO successfully launched PSLV C-48 - Sakshi

విజయవంతంగా పీఎస్‌ఎల్‌వీ సీ–48ను ప్రయోగించిన ఇస్రో 

సూళ్లూరుపేట: ఇస్రో తన విజయ విహారాన్ని కొనసాగిస్తూ శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి 75 ప్రయోగాలను పూర్తి చేసింది. బుధవారం ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) సీ–48 ప్రయోగంతో ప్లాటినం జూబ్లీ రికార్డుని నమోదు చేయగా.. మరోవైపు పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో అర్ధ సెంచరీని పూర్తి చేసింది. బుధవారం సాయంత్రం 3.25 గంటలకు ఇస్రో తన కదనాశ్వం పీఎస్‌ఎల్‌వీ సీ–48 రాకెట్‌ ద్వారా 628 కిలోల రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ (రీశాట్‌–2బీఆర్‌1) శాటిలైట్‌తోపాటు అమెరికాకు చెందిన మరో 6 ఉపగ్రహాలు, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను 21.19 నిమిషాల్లో భూమికి 576 కిలో మీటర్ల ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.  

ప్రయోగం సాగిందిలా.. 
- పీఎస్‌ఎల్‌వీ సీ–48 రాకెట్‌ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.19 నిమిషాల్లో పూర్తి చేశారు. సాయంత్రం 3.25 గంటలకు 44.4 మీటర్ల పొడవు గల పీఎస్‌ఎల్‌వీ–సీ48 ఉపగ్రహ వాహక నౌక 628 కిలోల బరువైన 10 ఉపగ్రహాలను విజయవంతంగా రోదసీలోకి మోసుకెళ్లింది.  
44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ–48 రాకెట్‌ను నాలుగు స్ట్రాపాన్‌ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. 
ప్రయోగ సమయంలో 291 టన్నుల బరువును మోసుకుంటూ రాకెట్‌ భూమి నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగికి పయనమైంది.  
మొదటి దశలోని నాలుగు స్ట్రాపాన్‌ బూస్టర్లలో 48 టన్నుల ఘన ఇంధనంతోపాటు కోర్‌ అలోన్‌ దశలో మరో 139 టన్నుల ఘన ఇందనాన్ని మండించుకుంటూ రాకెట్‌ భూమి నుంచి నింగి వైపు దూసుకెళ్లింది.  
నాలుగో దశ నుంచి రీశాట్‌–2బీఆర్‌1 ఉపగ్రహాన్ని భూమికి 576 కిలోమీటర్ల ఎత్తులోని వృత్తాకార సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 
అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలు, 1,278 సెకన్లకు జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. 
జపాన్‌కు చెందిన క్యూపీఎస్‌–సార్, ఇటలీకి చెందిన టైవాక్‌–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫాట్‌–3 అనే మూడు ఉపగ్రహాలను వాహక నౌక బయలుదేరిన 21.19 నిమిషాల్లో విజయవంతంగా ప్రవేశపెట్టి 75వ సారి విజయం సాధించారు.  

రీశాట్‌ ప్రత్యేకతలివీ.. 
సరిహద్దులో జరిగే చొరబాట్లును పసిగడుతుంది. ఇప్పటికే రెండు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో మూడో ఉపగ్రహమైన రీశాట్‌–2బీఆర్‌1ను రక్షణ రంగ అమ్ముల పొదిలో చేర్చింది. ఇందులో అమర్చిన పేలోడ్స్‌ను అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. తాజా ఉపగ్రహంలో అమర్చిన ఎక్స్‌బాండ్‌ సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌ భూమి మీద జరిగే మార్పులను పసిగడుతుంది.  భూమి మీద 10 సెంటీమీటర్ల వ్యాసార్థంలో ఉండే ఎలాంటి చిన్న వస్తువునైనా నాణ్యమైన చిత్రాలు తీసి çపంపిస్తుంది.  దేశ సరిహద్దులో అక్రమ చొరబాట్లు, పంటలు, సాగు విస్తీర్ణం, అడవులను పరిశోధించడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనూ నాణ్యమైన ఫొటోలు తీసి పంపిస్తుంది. ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్‌ భూమికి 576 కి.మీ. ఎత్తు నుంచి దేశానికి ఒక  సరిహద్దు సెక్యూరిటీగా ఐదేళ్లపాటు పనిచేస్తుంది.  

మహానుభావుల కృషి ఫలితమిది: ఇస్రో చైర్మన్‌
సూళ్లూరుపేట: పీఎస్‌ఎల్‌వీ వరుస విజయాలకు నాటి మహానుభావుల కృషే కారణమని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ అన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ–48 ప్రయోగం సక్సెస్‌ కావడంతో ఆయన మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో 50 ప్రయోగాలు చేయనున్నామని చెప్పారు.  తొలుత ‘గోల్డెన్‌ జూబ్లీ ఆఫ్‌ పీఎస్‌ఎల్‌వీ’ పుస్తకాన్ని శివన్‌ ఆవిష్కరించారు. 

గవర్నర్‌ అభినందనలు
సాక్షి, అమరావతి: పీఎస్‌ఎల్‌వీ సీ–48 వాహక నౌక ద్వారా ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు. ఇస్రో సాధించిన ఈ ఘనతతో దేశం గర్వపడుతోందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సీఎం జగన్‌ అభినందనలు 
సాక్షి,అమరావతి: పీఎస్‌ఎల్‌వీ–సీ 48 వాహక నౌక ద్వారా రీశాట్‌ –2బీఆర్‌1తోపాటు మరో తొమ్మిది వాణిజ్య ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సీఎంవో అధికారులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలను సొంతం చేసుకోవాలని సీఎం ఆకాంక్షించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top