
పనాజీ: భారత దేశానికి పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు పర్యటిస్తుంటారు. కాని తాజాగా భారతదేశాన్ని పర్యటించనున్న ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన భారతమూలాలు ఉన్న ఐర్లాండ్ ప్రధాని. గోవా సముద్రతీర ప్రాంతంలో నిర్వహించే 2020 నూతన సంవత్సర వేడుకల్లో తన కుటుంబ సభ్యులతో పాల్గొనడానికి భరత్ వస్తున్నట్లు సోమవారం గోవా రాష్ట్ర అధికారులు తెలిపారు. అయితే ప్రధాని లియో వరద్కర్ భారత పర్యటన వ్యక్తిగతమైందని.. ఈ పర్యటనలో భాగంగా లియో ఎటువంటి అధికారిక కార్యక్రమాలకు హాజరుకారని ఆ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.
జనవరి 1 వరకు ప్రధాని లియో వరద్కర్ తన కుంటుంబ సభ్యులతో గోవాలో గడుపుతారని ఆయన పేర్కొన్నారు. జనవరి 1 మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తిరిగి ఐర్లాండ్ వెళతారని ఆ పోలీసు అధికారి తెలిపారు. వరద్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని తీరప్రాంత సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న తన పూర్వీకుల గ్రామమైన వరద్‌ను ఆదివారం సందర్శించనున్నారు.
‘2017 లో నేను ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు. నా తండ్రి ఒక వైద్యుడు. ఆయన 1960లో ఇంగ్లాండ్ వెళ్లారు. నా పూర్వికుల గ్రామమైన వరద్‌ను సందర్శించటం ఇదే మొదటిసారి. ఇప్పుడు వరద్ గ్రామంలో మూడు తరాలకు చెందిన నా కుటుంబ సభ్యులను కలుసుకోవడం చాలా ప్రత్యేకం’ అని లియో వరద్కర్ తెలిపారు. ప్రధాని వరద్కర్ వరద్‌గ్రామ పర్యటనలో భాగంగా గ్రామ దేవతను దర్శించుకోనున్నారు. అదేవిధంగా వరద్ గ్రామ ప్రజలు ప్రధాని వరద్కర్‌ను సత్కరించన్నుట్లు తెలుస్తోంది.