గిలానీ ఆరోగ్యంపై పుకార్లు.. ఇంటర్నెట్‌కు బ్రేక్‌

Internet Services Snapped in Kashmir After Rumours About Syed Ali Shah Geelani Health Condition - Sakshi

శ్రీనగర్‌ : కశ్మీర్‌లో బుధవారం అర్ధరాత్రి ఆకస్మాత్తుగా మొబైల్‌ ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు చెలరేగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. గిలానీ ఆరోగ్యం క్షీణించిందని బుధవారం రాత్రి సోషల్‌ మీడియాలో కొందరు వ్యక్తులు పోస్టులు పెట్టినట్టు అధికారులు తెలిపారు. తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే మొబైల్‌ ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేశామని చెప్పారు. అలాగే శాంతి భద్రతలను అదుపు తప్పకుండా ఉండేందుకు కశ్మీర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించామని అన్నారు. మరోవైపు గిలానీ ఆరోగ్యంపై అతని కుటుంబ సభ్యులు స్పందించారు. గిలానీ కొద్దిపాటి అనారోగ్యానికి గురయ్యారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు.

కాగా, జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం కేంద్రం అక్కడ అన్నిరకాల సమాచార వ్వవస్థలను కొద్ది నెలలపాటు స్తంభింప చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గిలానీ రెచ్చగొట్టేలా ట్వీట్లు చేయడం కలకలం రేపింది. దీంతో ట్విటర్‌ ఆయన ఖాతాను నిలిపివేసింది. అయితే సమాచార వ్యవస్థపై అంక్షలు ఉన్నప్పటికీ.. గిలానీ ట్వీట్‌ చేసేందుకు సహకరించిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఇద్దరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. (చదవండి: ‘మళ్లీ డిటెన్షన్‌..! ఇదంతా పక్కా ప్లాన్‌’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top