సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రద్దు : ఇండియన్‌ రైల్వేస్‌

Indian Raiway Cancelling Samjhauta Express - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌, పాక్‌ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు భారత రైల్వేశాఖ ప్రకటించింది. మార్చి 4 నుంచి ఈ రైలును రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పుల్వామా ఉగ్ర దాడి - మెరుపు దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కూడా ఢిల్లీ - అతారీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలును షెడ్యూల్‌ ప్రకారమే నడుపుతామని రైల్వే అధికారి ఒకరు నిన్న ప్రకటించారు. ఇలా ప్రకటించి 24 గంటల కూడా గడవకముందే ఆ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా పాక్‌ సంఝౌతా సేవలను ఇప్పటికే నిలిపివేసింది. ఫలితంగా పాక్‌ నుంచి అటారికి రావాల్సిన ప్రయాణికులు లాహోర్‌ రైల్వేస్టేషన్‌లోనే ఆగిపోయారు. వాళ్లని వేరే మార్గాల ద్వారా అటారి సరిహద్దుకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ వారంలో రెండు రోజులు(బుధ, ఆదివారాలు) నడుస్తుంది. ఢిల్లీ నుంచి బయలుదేరి అటారీలో ప్రయాణికులను దించుతుంది. ఆ తరువాత ప్రయాణికులు వాఘాలో ఇదే పేరుతో నడిపే మరో రైలులోకి మారాల్సి ఉంటుంది.

అయితే సంఝౌతా పేరు వెనక చిన్న హిస్టరీ ఉంది. 1971లో ఇండో - పాక్‌ మధ్య ప్రారంభమైన యుద్ధం సిమ్లా ఒప్పందతో ముగిసింది. ఈ ఒప్పందానికి చిహ్నంగా ఇరు దేశాల మధ్య1976 జూలై 22 నుంచి సంఝౌతా రైలు సర్వీస్‌ ప్రారంభమయ్యింది. సంఝౌతా అంటే ‘ఒప్పందం’ అని అర్థం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top