
బాధితురాలు, గాయని అవంతీ పటేల్ (ఫైల్)
ముంబై: ప్రముఖ టెలివిజన్ సంగీత కార్యక్రమం ఇండియన్ ఐడల్-10తో మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న సింగర్ అవంతీ పటేల్ (23)ను ఒక సైబర్ నేరగాడు మోసం చేశాడు. బ్యాంక్ ఉద్యోగినంటూ నమ్మించి అవంతీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కాజేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆమె సియాన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జార్ఖండ్‌కు చెందిన నిందితుడు జయరంజన్ మండల్ (22) అవంతీకు ఫోన్ చేసి తాను ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగినని నమ్మించి ఆమె బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్ కార్డు పాస్‌వర్డ్‌లను తెలుసుకున్నాడు. వాటి ద్వారా అవంతీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేటీఎమ్, డిజిటల్ వ్యాలెట్‌లను ఉపయోగించి దాదాపు రూ.1.7 లక్షల వరకూ నగదును డ్రా చేశాడు. కొంతసేపటికి మోసాన్ని గమనించిన అవంతీ వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తును ఆరంభించిన పోలీసులు నిందితుడి ఫోన్ కాల్స్ ఆధారంగా అతడి చిరునామా, కొట్టేసిన డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసిన బ్యాంకు ఖాతాల వివరాలనూ కనిపెట్టారు. అనంతరం జార్ఖండ్‌లో నిందితుడ్ని పోలీసలు పట్టుకున్నారు.