యూఎస్‌ రిపోర్టుపై భారత్‌ ఆగ్రహం

India Rejects US Report On Religious Freedom - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశవ్యాప్తంగా దళితులు, ముస్లింలపై దాడులు విపరీతంగా పెరిగాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ విడుదల చేసిన నివేదికను భారత ప్రభుత్వం ఖండించింది. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వంలో మైనార్టీల మత స్వేచ్ఛకు తీవ్ర భంగం ఏర్పడిందని అమెరికాకు చెందిన ఇంటర్‌నేషనల్‌ రిలీజియన్‌ ఫ్రీడమ్‌  అనే స్థంస్థ తన నివేదనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సంస్థ సర్వేపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా జీవిస్తున్నారని స్పష్టం చేసింది. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్న వార్తలను ఖండించింది.

ఈ మేరకు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రావీష్‌ కుమార్‌ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ ప్రజలకు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా అశాంతి లేదని, దళితులు, మైనార్టీలకు తమ ప్రభుత్వంపై పూర్తి స్థాయి విశ్వాసం ఉందని  స్పష్టం చేశారు. యూఎస్‌ రిపోర్టుపై పలువురు బీజేపీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ.. తన నివేదికలో పలు విషయాలను పొందుపరిచింది. హిందుమత వ్యాప్తి కోసం ఇతర మతాలపై హిందుత్వ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొంది.

దాడులను అరికట్టడంలో బీజేపీ విఫలం
ముఖ్యంగా  భారత రాజ్యాంగం దేశ ప్రజలకు, అన్ని మతాలకు ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా కొన్ని సంస్థలు వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మైనార్టీలపై దాడులకు అరికట్టడంలో తీవ్రంగా విఫలమైందని, మూక దాడుల పేరుతో ఓ వర్గాన్ని తీవ్రంగా హింసిస్తున్నారని నివేదికలో పేర్కొంది. దక్షిణ భారతదేశంతో పోలిస్తే.. ఉత్తరంలో మూకదాడులు విపరీతంగా పెరిగాయని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దాడులు ఎక్కువగా ఉన్నాయని  ఇంటర్‌నేషనల్‌ రిలీజియన్‌ ప్రీడమ్‌ రిపోర్టు తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top