రికవరీ రేట్‌ @ 25% | Sakshi
Sakshi News home page

రికవరీ రేట్‌ @ 25%

Published Fri, May 1 2020 4:12 AM

India is recovery rate climbs to 26 per cent - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే కాలం లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి ముందు 3.4 రోజులుండగా, ప్రస్తుతం 11 రోజులుగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, ప్రస్తుతం కేసులతో పోలిస్తే మరణాల శాతం 3.2గా ఉందని పేర్కొంది. కోలుకుంటున్నవారి శాతం కూడా గత రెండువారాల్లో గణనీయంగా పెరిగిందని, ఆ శాతం రెండు వారాల క్రితం 13.06 ఉండగా, ప్రస్తుతం 25కి పైగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వివరించారు. మొత్తం కేసుల్లో 8,324 మంది, అంటే 25.19% కోవిడ్‌–19 నుంచి కోలుకున్నారన్నారు.

ఢిల్లీ, యూపీ, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, తమిళనాడుల్లో కేసులు రెట్టింపయ్యే సమయం 11 నుంచి 20 రోజులుగా ఉందని, కర్ణాటక, లద్ధాఖ్, హరియాణా, ఉత్తరాఖండ్, కేరళల్లో అది 20 నుంచి 40 రోజులుగా ఉందని వెల్లడించారు. కోవిడ్‌తో మరణించిన వారిలో 65% పురుషులని, 35% స్త్రీలని తెలిపారు. వయస్సులవారీగా మరణాలను గణిస్తే.. మృతుల్లో 45 ఏళ్లలోపు వయసున్న వారు 14%, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్నవారు 34.8%, 60 ఏళ్ల పైబడిన వారు 51.2% ఉన్నారని వివరించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే కేసులు రెట్టింపు అయ్యే సమయం భారత్‌లోనే ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

 

Advertisement
Advertisement