ఆత్మవిమర్శ కోసం అడవికి!

'I used to spend 5 days every Diwali in jungle - Sakshi

ప్రతీ దీపావళికి వెళ్లి..ఐదు రోజులు ఉండేవాణ్ని

ఆ అనుభవం ఇప్పటికీ ఉపయోగపడుతోంది: మోదీ  

ముంబై: యువకుడిగా ఉన్న రోజుల్లో తాను ప్రతీ దీపావళికి ఐదు రోజులపాటు అడవిలోకి ఒంటరిగా వెళ్లి ఆత్మవిమర్శ చేసుకునేవాడినని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆ అలవాటు కారణంగానే తనకు ఇప్పటికీ జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కొనే శక్తి లభిస్తోందని తెలిపారు. ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే ఫేస్‌బుక్‌ పేజీకి ఇచ్చిన ఇంట ర్వ్యూలో మోదీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాలను ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ బుధవారం ప్రచురించింది.

అందులో కొంత భాగాన్ని మోదీ తన ట్విట్టర్‌ ఖాతాలోనూ పోస్ట్‌ చేశారు. ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ ‘ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. ఆ రోజుల్లో ప్రతీ దీపావళికి నేను ఐదు రోజులపాటు దూరంగా వెళ్లే వాణ్ని. అడవిలో ఏదో ఒక చోట, ఎక్కడైతే స్వచ్ఛమైన నీరు తప్ప మనుషులు ఉండరో అక్కడకు చేరుకునే వాణ్ని. ఇన్నాళ్లూ ఏం చేశాను, ఇకపై ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏ పని చేయాలి తదితర అన్ని విషయాలపై అంతర్మథనం చేసుకునే వాడిని. నేను వెళ్లిన చోట వార్తా పత్రికలు కానీ, రేడియో కానీ ఉండేది కాదు. ఇక టీవీ, ఇంటర్నెట్‌ ఆ రోజుల్లో అసలు లేనే లేవు’ అని అన్నారు.  

యువత సమయం కేటాయించుకోవాలి
ఈనాటి యువత కాస్తంత తీరిక కూడా లేకుండా తమ జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, వారు కూడా ఎప్పుడో ఒకసారి కొంత సమయాన్ని కేటాయించుకుని అంతర్మథనం చేసుకోవాలని మోదీ కోరారు. అలా చేయడం వల్ల యువత ఆలోచనా దృక్పథం మారుతుందనీ, వారికా వారే బాగా అర్థమవుతారనీ, మరింత ఆత్మవిశ్వాసం రావడంతోపాటు ఇతరులు మీ గురించి ఏమనుకున్నా చలించని మనస్తత్వం అలవడుతుందన్నారు.

ఏం చేయాలో తెలీక హిమాలయాలకు..
చిన్నతనంలోనే తాను రెండేళ్లపాటు హిమాలయాలకు వెళ్లిన విషయంపై కూడా మోదీ చెప్పారు. ‘నేను జీవితంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఏ మార్గాన్నీ ఎంచుకోలేదు. అంతా అస్పష్టతే. నేను ఎక్కడికి వెళ్లాలో నాకే తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఎందుకు చేయాలో తెలీదు. కానీ ఏదో ఒకటి చేయాలన్నది మాత్రమే నాకు అప్పుడు తెలుసు. కాబట్టి నాకు నేనుగా భగవంతుడికి అంకితమయ్యాను. 17 ఏళ్ల వయసులోనే హిమాలయాలకు వెళ్లాను.

ఆ తర్వాత దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లాను’ అంటూ మోదీ తన గతం గురించి గుర్తుచేసుకున్నారు. ‘నా జీవితం ఎటు వెళ్లాలో నిర్ణయమవ్వని దశ అది. అయినా అనేక ప్రశ్నలకు జవాబులు దొరికాయి. ప్రపంచాన్ని, నన్ను నేను అర్థం చేసుకున్నా. రామక్రిష్ణ మిషన్‌లో కా లం గడిపా. నాలో నేనే ఏదో కొత్తది కను గొన్నా. బ్రహ్మ ముహూర్తంలోనే, వేకువ జాము న3–3.45 మధ్యలో నిద్రలేచి, గడ్డకట్టే నీటితోనే హిమాలయాల్లో స్నానం చేసే వాడిని. శాంతి, ఏకాంతం, ధ్యానాన్ని ఒక జలధార శ బ్దంలోనూ మనం పొందొచ్చని అర్థం చేసుకున్నా. ప్రకృతి తరంగాలతో ఎలా మమేకమవ్వాలో అక్కడి సాధువులు నేర్పారు’ అని చెప్పారు.


ఎర్రకోటలో నేతాజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మోదీ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top