అయోధ్య తీర్పు: ప్రధాని మోదీకి చక్రపాణి లేఖ

Hindu Mahasabha Urges Withdrawal Of Cases Against Kar Sevaks - Sakshi

న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేతలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కరసేవకులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్‌ చేసింది. 1992లో జరిగిన అయోధ్య ఉద్యమంలో మరణించిన రామభక్తులకు అమరవీరుల హోదా ఇవ్వాలని విఙ్ఞప్తి చేసింది. అదే విధంగా ఉద్యమంలో పాల్గొన్న వారిని ధార్మిక సేనానులుగా గుర్తించి పెన్షన్‌ ఇవ్వడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని కోరింది. ఇది కరసేవకులు తెలియక చేసిన తప్పిదమని.. కాబట్టి వారిపై కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసింది. ఈ మేరకు హిందూ మహాసభ చీఫ్‌ స్వామి చక్రపాణి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మంగళవారం లేఖ రాశారు.

‘నవంబరు 9న రాంలల్లాకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కాబట్టి అక్కడ మందిరం ఉందనే విషయం స్పష్టమైంది. కాబట్టి కరసేవకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. అయెధ్య ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. స్వాతంత్ర్య సమరయోధుల వలె ధార్మిక సేనానులకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు అందించాలి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నేను ఈ మూడు డిమాండ్లు మీ ముందు ఉంచుతున్నాను’ అని చక్రపాణి లేఖలో పేర్కొన్నారు.

కాగా అయోధ్యలో వివాదాస్పందగా మారిన రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సర్వోన్నత న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించిన విషయం విదితమే. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకే చెందుతుందని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు... మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే 5 ఎకరాలు సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే తొలుత సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సున్నీ వక్ఫ్‌ బోర్డు.. అనంతరం తాము తీర్పును స్వాగతిస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య వివాదానికి తెరపడింది. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top