ఏఐసీసీ కార్యాలయం వద్ద చిదంబరం ప్రత్యక్షం

High Drama At Congress Office As Chidambaram Reaches Aicc Headquarters - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ గత 24 గంటలుగా అజ్ఞాతంలో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం బుధవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. చిదంబరం కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయానికి రావడంతో అక్కడ హైడ్రామా నెలకొంది. ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తాను నిందితుడిని కాదని, చార్జిషీట్‌లో తన పేరుకూడా లేదని ఆయన చెప్పారు. తనకూ, తన కుమారుడికి ఈ కేసులో సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఐఎన్‌ఎక్స్‌ కేసులో తన కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదని, ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ కూడా లేదని చెప్పుకొచ్చారు. నిన్న రాత్రంతా తాను తన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ గడిపానని చెప్పారు. మరోవైపు చిదంబరం కోసం గాలిస్తున్న సీబీఐ అధికారులు కాంగ్రెస్‌ కార్యాలయానికి బయలుదేరారు. ​కాగా, అరెస్ట్‌ నుంచి తక్షణ ఉపశమనం కల్పించాల్సిందిగా ఆయన చేసుకున్న అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది.

చిదంబరం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ శుశ్రవారం విచారణకు రానుంది. చిదంబరం అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసిన క్రమంలో గడిచిన 24 గంటల నుంచీ ఆయన అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఇక 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు సమకూరడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ)  ఆమోదముద్ర వేయడంలో అప్పటి ఆర్థిక మంత్రిగా నిబంధనలకు విరుద్ధంగా పచ్చజెండా ఊపారని చిదంబరం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ నిధుల రాకకు ఎఫ్‌ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top