హైకోర్టు విభజనే ప్రధాన ఎజెండా

హైకోర్టు విభజనే ప్రధాన ఎజెండా - Sakshi


- కేంద్రం స్పందించే తీరును బట్టి ప్రణాళిక ఉండాలి  

- పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం

- పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

-  అంశాల వారీగా కేంద్రానికి మద్దతిస్తాం: జితేందర్‌రెడ్డి

- నేడు ప్రధాని మోదీతో సమావేశం కానున్న కేసీఆర్




సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు విభజనే ప్రధాన ఎజెండాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ముందుకెళ్లాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. అయితే ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పందించే తీరును బట్టి మన ప్రణాళిక ఉండాలని ఆయన సూచిం చారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు ఆయన అధికార నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి, పార్టీ ఎంపీలు పాల్గొ న్నారు.

 

 సమావేశం అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘వర్షాకాల సమావేశాల్లో పార్టీ వైఖరి ఎలా ఉండాలన్న విషయమై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వారి ఆదేశానుసారం వర్షాకాల సమావేశాల్లో మొట్టమొదట హైకోర్టు విభజన అంశాన్ని ప్రస్తావిస్తాం. రెండేళ్లుగా ప్రతీ సమావేశాల్లోనూ మేం ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నాం. హైకోర్టు విషయాన్ని లేవనెత్తిన ప్రతిసారీ హోంమంత్రి, న్యాయమంత్రి, ఇతర మంత్రులుగానీ సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు.

 

  మేం కూడా సహకరిస్తూ వచ్చాం. రెండేళ్లు పూర్తయినా విభజన కాలేదు. ఇంతకుముందు ఉత్తరాఖండ్, ఛ త్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 15 రోజుల్లో హైకోర్టులు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ విషయంలో అనవసరంగా జాప్యం చేస్తూ వస్తున్నారు. అందువల్ల ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విభజన చేయాలన్నది మా డిమాండ్. అంతేకాక నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు, రహదారులు, రైల్వేలు, మేం చేపట్టిన వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, హరితహారం తదితర పథకాలకు కేంద్రం సాయం చేయాలని కోరుతాం. ఏయే శాఖల నుంచి ఎంత అవసరమో సంబంధిత అంశాలను లేవనెత్తుతాం. కేంద్ర ప్రభుత్వానికి అంశాలవారీగా మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..’ అని పేర్కొన్నారు.

 

 హైకోర్టు విభజనపై పార్లమెంటులో ఆందోళన ఏవిధంగా ఉండబోతోందన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘మా నిరసన తెలుపుతాం. ఏవిధంగా ఉండబోతోందన్న దానిపై వ్యూహం ఖరారు చేస్తాం. వారి స్పందనను బట్టి మా వైఖరి ఉంటుంది..’ అని పేర్కొన్నారు. హైకోర్టు విభజన రాష్ట్ర పరిధిలో ఉందని, కేంద్రం విధి ఏమీ లేదని గతంలో న్యాయ మంత్రి చెప్పారని మీడియా ప్రస్తావించగా ‘కేంద్రం గందరగోళంలో ఉంది. న్యాయమంత్రి సబ్ జ్యుడీస్ అని చెబుతారు. మరికొందరు పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఏదేమైనా హైకోర్టు విభజన జరగాలి. అంతవరకూ మా ఆందోళన కొనసాగుతుంది..’ అని చెప్పారు. నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటుపై ఏపీ పట్టుబడుతోందన్న ప్రశ్నకు బదులుగా ‘బ్రిజేశ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చేవరకు బోర్డు ఏర్పాటు చేయరాదు. కేంద్రాన్ని కూడా ఆవిధంగా కోరాం. అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉంది. అంటే సబ్ జ్యుడీస్ అవుతుంది. అలాంటప్పుడు బోర్డు ఎలా ఏర్పాటు చేస్తారు? అది సరికాదని మా వాదన మేం వినిపిస్తాం..’ అని పేర్కొన్నారు.

 

 నేడు ప్రధానితో కేసీఆర్ భేటీ: ఎంపీ వినోద్

 టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం లోక్‌సభలో టీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బోయినపల్లి వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారని వెల్లడించారు. హైకోర్టు విభజన, ఇతర ముఖ్యమైన అంశాలపై ఆయన ప్రధానితో చర్చిస్తారని వివరించారు. పార్లమెంటులో జీఎస్టీ బిల్లుకు తాము మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారని వినోద్ వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top