విదర్భ, మరాఠ్వాడాలను కుదిపేస్తున్న భారీ వర్షాలు | heavy rains in vidarbha, marathwada | Sakshi
Sakshi News home page

Aug 23 2018 10:34 AM | Updated on Oct 8 2018 5:45 PM

heavy rains in vidarbha, marathwada - Sakshi

సాక్షి, ముంబై : గత రెండు రోజులుగా విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 11 మంది చనిపోయారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గడచిన రెండు రోజుల్లో మరాఠ్వాడలోని నాందేడ్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సరాసరి 91 శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే పంటలు, విత్తనాలు, ఎరువుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక భారీ వర్షాలకు పంటలకు నష్టం జరగడంతోపాటు ఇళ్లు కూడా కూలిపోవడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు.

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత..
మంగళవారం భండార జిల్లాలో భారీ వర్షానికి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఇదే జిల్లాలో కోండి గ్రామంలో నాలా పొంగిపోర్లి పారడంతో దీనికి ఆనుకుని ఉన్న బస్తీ నీటిలో కొట్టుకుపోవడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా రాత్రి నిద్రలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. భండార జిల్లాలో నాలాలు పొంగిపొర్లడంతో ఇక్కడుంటున్న వందలాది పేద కుటుంబాలను, ఎడ్లు, ఆవులు, గేదెలు, మేకలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ జిల్లాలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 113 మి.మీ. వర్షపాతం నమోదైంది.

ఉప్పొంగుతున్న నదులు..
నాగ్‌పూర్‌ జిల్లాలో వరదలు రావడంతో ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. నాగ్‌పూర్‌ సిటీలో వచ్చిన వరదలకు ఓ చిన్న పిల్లాడు నీటిలో పడి గల్లంతయ్యాడు. నాందేడ్‌లో వరదలకు నలుగురు గల్లంతయ్యారు. పర్భణీ జిల్లాలో గంగాఖేడ్‌ తాలూకాలో నాలుగు గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. హింగోళి జిల్లాలో వైన్‌గంగా పొంగిపొర్లడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. నాసిక్‌ జిల్లాలో గోదావరి నది నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో ముందు జాగ్రత్త చర్యగా నదికి ఆనుకుని ఉన్న గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జల్గావ్‌ జిల్లాలో హత్నూర్‌ డ్యాంలో ఒక్కసారిగా నీటి నిల్వలు పెరిగిపోవడంతో 32 గేట్లు ఎత్తివేశారు. దీంతో తాపి నది పొంగిపొర్లుతుంది. జల్గావ్‌ జిల్లాలో 24 గంటల్లో 31.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి 91 శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే వివిధ పెద్ద డ్యాముల్లో 51.17 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. గడచిన రెండు రోజుల్లో అత్యధిక వర్షపాతం మరాఠ్వాడలోని నాందేడ్‌ జిల్లాలో నమోదైంది.  

ముంబైకర్లకు ఊరట..
ముంబైలో గత వారం రోజులుగా జల్లులు కురుస్తుండటంతో ముంబైకర్లకు కొంత ఊరట కలిగినట్లైంది. మొన్నటి వరకు వేసవిని తలపింపజేసినా, మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడటంతో ముంబైకర్లకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. ఇక ముంబైకి నీటి సరఫరాచేసే ఆరు జలాశయాల్లో భాత్సా జలాశయం ఓవర్‌ ఫ్లో అయింది. దీంతో మూడు గేట్లు ఎత్తివేసి  68.67 క్యూసెక్కుల నీరు వదిలేశారు. తాన్సా, వైతర్ణ, మధ్య వైతర్ణ, మోడక్‌సాగర్‌ జలాశయాలు కూడా ఇదివరకే ఓవర్‌ ఫ్లో అయ్యాయి. ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉండటంతో భాత్సా జలాశయానికి సమీపంలో ఉన్న రెండు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement