
గురుగ్రామ్‌లోని సుభాష్ నగర్‌లో గల ద్రోణాచార్యుడి ఆలయం..
గురుగ్రామ్, హరియాణ: కురు, పాండవులకు విలువిద్య నేర్పిన గురు ద్రోణాచార్యుడి ఆలయం నిరాదరణకు గురవుతోంది. దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఉంది. అయితే, నగరంలోని సుభాష్ నగర్‌లో ఉన్న ఈ ఆలయం ఇరుకు వీధుల్లో, చుట్టూ చెట్లతో నిండిన ప్రదేశంలో ఉండడంతో జనాదరణకు నోటుకోవడం లేదు. దేశంలో ద్రోణుడికి ఉన్న ఏకైక ఆలయంపట్ల అటు ప్రభుత్వం, ఇటు పాలకుల చిన్న చూపు తగదని స్థానికులు అంటున్నారు.
1872లో సింఘా భగత్ అనే భూస్వామి ఈ ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెప్తున్నారు. ద్రోణాచార్యుడికి నిత్య పూజలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ధూపదీప నైవేద్యాలు నిర్విఘ్నంగా సాగాలని వందల ఎకరాలు ఆలయానికి మాన్యంగా దానం ఇచ్చాడని అంటున్నారు. కాలక్రమంలో ఆ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వారు తెలిపారు.
ఆమె గుడికి వైభవం..
ద్రోణాచార్యుడి భార్య శీత్లాదేవికి కూడా గురుగ్రామ్‌లో ఆలయం ఉంది. 18వ శతాబ్దానికి చెందిన రాజస్థాన్ మహారాజు దీనిని నిర్మించారు. హరియాణాలో భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా శీత్లాదేవి ప్రాచుర్యం పొందారు. ‘కురు, పాండవుల గురువు ద్రోణాచార్యుడి గుర్తుగా ఈ ప్రాంతం పేరును ఇటీవలే గురుగ్రామ్‌గా మార్చారనీ, అయినా సందర్శకుల సంఖ్యకు నోచుకోవడం లేదని గుడి పూజారి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ సహాయ, సహకారాలు కోరతామని అన్నారు. సుభాష్ నగర్ ప్రాంతానికి ‘గురు ద్రోణాచార్య నగర్’గా నామకరణం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పారు. ఆలయ పునరుద్ధరణకు కూడా ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఆలయం నిర్మితమైన ప్రదేశానికి గురు ద్రోణాచార్యుడికి ఏ విధమైన సంబంధాలు లేవని చరిత్రకారులు వాదిస్తున్నారు.