గుజరాత్‌లో విద్యుత్‌ బకాయిల మాఫీ

Gujarat Government Waives Off  Rural Electricity Bills - Sakshi

అహ్మదాబాద్‌ : మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కొలువుదీరిన కొద్దిగంటలకే రైతు రుణ మాఫీని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ సారథ్యంలోని గుజరాత్‌ ప్రభుత్వం రూ 650 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులను మాఫీ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు బకాయి పడిన విద్యుత్‌ బిల్లుల మాఫీపై గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.22 లక్షల కనెక్షన్లకు సంబంధించిన వినియోగదారులు పెండింగ్‌ విద్యుత్‌ బిల్లుల మాఫీతో రూ 650 కోట్ల మేర లబ్ధి పొందుతారని గుజరాత్‌ విద్యుత్‌ శాఖ మంత్రి సౌరభ్‌ పటేల్‌ తెలిపారు.

విద్యుత్‌ చౌర్యం, బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో ఈ కనెక్షన్లను తొలగించామని వీటిలో గృహ, వ్యవసాయ, వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. పెండింగ్‌ విద్యుత్‌ బిల్లుల మాఫీతో ఆయా కనెక్షన్లను పునరుద్ధరిస్తారు. కాగా మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాల మాఫీ ప్రకటించడం, ప్రధాని మోదీ రైతులకు మేలు చేసేవరకూ విశ్రమించనని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ స్పష్టం చేయడంతో అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో రుణ మాఫీ ప్రకటించాలని పటేల్‌ ఉద్యమ నేత హార్థిక్‌ పటేల్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top