
న్యూఢిల్లీ: సినిమా షూటింగ్‌లకు అనుమతుల జారీని సరళతరం చేసేందుకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రకటించారు. పైరసీని అరికట్టేందుకు యాంటి క్యామ్‌కార్డింగ్ నిబంధనలు తెస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో చిత్రీకరణ జరిపే విదేశీ సినిమాలకు మాత్రమే సింగిల్ విండో అనుమతుల జారీ విధానం ఉండగా ఇప్పుడు భారతీయ సినిమాలకు కూడా వర్తింపచేస్తున్నట్లు గోయల్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.
పైరసీని అరికట్టేందుకు సినిమాటోగ్రఫీ చట్టంలో కామ్‌కార్డింగ్‌ను నిరోధించే నిబంధనలను పొందుపరుస్తామన్నారు. సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని, చిత్ర నిర్మాతలకు కూడా తాజా నిర్ణయం మేలు చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సినీ పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతుల జారీతో చిత్ర పరిశ్రమకు మేలు జరుగుతుందని పేర్కొన్నాయి.