సీఐసీలో పోస్టుల భర్తీకి ప్రకటన

Govt Invites Applications For Posts Of Information Commissioners In CIC - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ)లోని ఖాళీల భర్తీకి కేంద్రం ప్రకటన విడుదల చేసింది. సమాచార కమిషనర్‌ పోస్టుకు ఆసక్తి గల 65 ఏళ్లలోపు అభ్యర్థులు ప్రొఫార్మా ప్రకారం వివరాలను పంపాలని కోరింది. అభ్యర్థులు ప్రజా జీవితంలో ఉండి విస్తృత పరిజ్ఞానం, అనుభవంతోపాటు చట్టాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక సేవ, జర్నలిజం, మేనేజ్‌మెంట్, పరిపాలన తదితర రంగాల్లో నిపుణులై ఉండాలని తెలిపింది. వేతనం, అలవెన్సు, ఇతర సదుపాయాలు, నిబంధనలను నియామక సమయంలో వెల్లడిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.

సీఐసీలో 10 మంది కమిషనర్లకు గాను ప్రధాన సమాచార కమిషనర్‌ రాథా కృష్ణ మాథుర్‌ సహా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. సమాచార హక్కు చట్టంలో పలు మార్పులు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. సమాచార కమిషనర్ల వేతనాలు, అలవెన్సులు, ఇతర నియమ నిబంధనలను ప్రభుత్వం సూచించిన విధంగానే ఉండాలి. వారి పదవీ కాలం ఐదేళ్లు కాకుండా ప్రభుత్వం సూచించిన కాలానికే పరిమితం కావాలి.. వంటివి కూడా ఉన్నాయి. ఇటువంటి మార్పులతో ఈ చట్టాన్ని బలహీన పరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామంటున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top