యాసిడ్‌ బాధితులకు కోటా

Government Job Quota For Acid Attack Survivors, People With Disability - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ఆటిజం, మానసిక అనారోగ్యం, బుద్ధి మాంద్యంతో పాటు యాసిడ్‌ దాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీఅయ్యాయి. ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీచేసే గ్రూప్‌ ఏ, బీ, సీ ఉద్యోగాల్లో 40 శాతానికి పైగా వైకల్యస్థాయి ఉన్న అభ్యర్థులకు మొత్తం ఖాళీల్లో నాలుగు శాతం కేటాయించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మొత్తం గతంలో మూడు శాతంగా ఉండేది.

దృష్టి లోపం, వినికిడి లోపం, సెరిబ్రల్‌ పాల్సీ, మరుగుజ్జు, కుష్ఠు వ్యాధి నయమైనవారు, యాసిడ్‌ దాడి బాధితులకు ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కేంద్ర సిబ్బంది, శిక్షణా విభాగం(డీవోపీటీ) అన్ని ప్రభుత్వ విభాగాలకు ఇటీవల లేఖ రాసింది. వీరితో పాటు ఆటిజం, మానసిక అనారోగ్యం, బుద్ధిమాంద్యంతో బాధపడేవారికి కూడా ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్‌ కేటాయించాలని కోరింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రతి కేంద్ర ప్రభుత్వ విభాగం వైకల్యమున్న ఉద్యోగుల ఫిర్యాదులు స్వీకరించడానికి ఓ అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందుకునే అధికారులు 2 నెలల్లోగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు కేటాయించిన ఉద్యోగాల్లో వైకల్యమున్న అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ సర్దుబాటు చేయరాదని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top