
సాక్షి, చెన్నై : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఓ జర్మన్ విద్యార్థిని అధికారులు దేశం నుంచి పంపించేశారు. అతని చర్య వీసా నిబంధనలను ఉల్లంఘిస్తోందని, దేశ బహిష్కరణ చేయకముందే దేశాన్ని విడిచి వెళ్లాలంటూ ఆ విద్యార్థికి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివరాలు.. మద్రాస్ ఐఐటీలో భౌతికశాస్త్రంలో పీజీ చదువుతున్న జాకబ్ లిండెంతల్ అనే జర్మన్ విద్యార్థి గత వారం సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాడు. ఈ విషయం తెలుసుకొని జాకబ్‌ను విచారించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గాను సోమవారం అర్థరాత్రి కల్లా దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. లేదంటే దేశ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
దీంతో జాకబ్ చేసేది లేక సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి బయలుదేరి అమ్‌స్టర్‌డామ్ నగరానికి చేరుకున్నారు. ఈ విషయంపై జాకబ్ స్పందిస్తూ.. నేను స్నేహితులతో చెపాక్, వల్లవర్ కొట్టంకు వెళ్లాను. అప్పటికి 144 సెక్షన్ విధించలేదు. సీఏఏపై ఎలాంటి అభిప్రాయాన్ని గానీ, వ్యతిరేకతను గానీ వ్యక్తం చేయలేదు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదని తెలిపాడు. అర్థాంతరంగా దేశం నుంచి వెళ్లగొట్టడంపై న్యాయ నిపుణులను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటానని జాకబ్ వెల్లడించాడు. ఈ పరిణామాలపై మద్రాస్ ఐఐటీని సంప్రదించగా, వారు ఇంకా స్పందించాల్సి ఉంది.