
అగ్రస్థానంలో ఐఐటీ మద్రాస్
ఎన్‌ఐఆర్‌ఎఫ్ పదో ఎడిషన్ ర్యాంకింగ్స్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) 2025లో ఓవరాల్ విభాగంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) బెంగళూరు ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ పదో ఎడిషన్ ర్యాంకింగ్స్‌ను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ప్రకటించారు. ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది ఏడోసారి. ఉత్తమ వర్సిటీగా బెంగళూరు ఐఐఎస్‌సీ నిలవడం వరుసగా ఇది పదో సంవత్సరం.
ఓవరాల్ విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు రెండో స్థానంలో నిలవగా.. తరువాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీలు నిలిచాయి. ఉత్తమ వర్సిటీల్లో రెండో స్థానాన్ని జేఎన్‌యూ, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో మొదటి మూడు స్థానాల్లో కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్ వర్సిటీ నిలిచింది. గతేడాది మూడో స్థానంలో నిలిచి జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ఒక స్థానం పడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది.
ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలో తొమ్మిది ఐఐటీలు టాప్ టెన్‌లో నిలిచాయి. ఈ విభాగంలో ఐఐటీ మద్రాస్ వరుసగా పదో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబేలు రెండు, మూడు స్థానాలను నిలుపుకొన్నాయి. టాప్ టెన్ జాబితాలో నిలిచిన ఏకైక నాన్ ఐఐటీ తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మేనేజ్‌మెంట్ కళాశాలల్లో ఐఐఎం అçహ్మదాబాద్ తన అగ్రస్థానాన్ని నిలుపుకొంది.
ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజీకోడ్ తరువాతి స్తానాలను దక్కించుకున్నాయి. టాప్ 10 బీ స్కూల్స్‌లో ఏడు ఐఐఎంలు నిలవగా.. ఏకైక టెక్ సంస్థ ఐటీ ఢిల్లీ ఈ విభాగంలో చోటు దక్కించుకుంది. వైద్య కళాశాలల్లో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పరిశోధనా సంస్థల్లో ఐఐఎస్‌సీ బెంగళూరు అగ్రస్థానంలో, ఐఐటీ మద్రాస్ తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఓపెన్ విశ్వవిద్యాలయాల్లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్‌యూనివర్సిటీ(ఇగ్నో) మొదటి స్థానంలో, కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ మైసూరు రెండో స్థానంలో నిలిచాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్ పదో ఎడిషన్ తొమ్మిది విభాగాల్లో ర్యాంకులిచ్చింది.