సీడీఎస్‌గా బిపిన్‌ రావత్‌

Gen Bipin Rawat named Indias first Chief of Defence Staff - Sakshi

కేబినెట్‌ కమిటీ ఆమోదం

2023 వరకు కొనసాగే అవకాశం

న్యూఢిల్లీ: దేశ మొట్టమొదటి రక్షణ బలగాల అధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్, సీడీఎస్‌)గా జనరల్‌ బిపిన్‌ రావత్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది. ఈ నియామకం డిసెంబర్‌ 31(నేటి)నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కేబినెట్‌ కమిటీ సీడీఎస్‌గా రావత్‌ నియామకానికి సోమవారం ఆమోదం తెలిపిందని ఓ అధికారి చెప్పారు. కార్గిల్‌ యుద్ధం సమయంలో త్రివిధ దళాల్లో కనిపించిన సమన్వయలోపం నేపథ్యంలో సీడీఎస్‌ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

అప్పటినుంచి  దాదాపు 20 ఏళ్లుగా ఫైళ్లలోనే మగ్గుతున్న సీడీఎస్‌ను ఇటీవల కేంద్రం కార్యరూపంలోకి తెచ్చింది. సైన్యం, నావికా, వైమానిక దళాలను సమన్వయపరుస్తూ సైనిక సంబంధిత విషయాల్లో రక్షణమంత్రికి సలహాదారుగా వ్యవహరించడం సీడీఎస్‌ ప్రధాన బాధ్యత. దళాధిపతితో సమాన హోదా, వేతనం, ఇతర సౌకర్యాలు సీడీఎస్‌కు ఉంటాయి. రక్షణ శాఖలో కొత్తగా ఏర్పాటయ్యే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మిలటరీ ఎఫైర్స్‌(డీఎంఏ) కార్యదర్శిగా సీడీఎస్‌ వ్యవహరిస్తారు.

ఆర్మీ, నేవల్, ఎయిర్, డిఫెన్స్‌ స్టాఫ్‌ ప్రధాన కార్యాలయాలు డీఎంఏలోనే ఉంటాయి. చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీకి సీడీఎస్‌ శాశ్వత చైర్మన్‌గా ఉంటారు. త్రివిధ దళాలకు చెందిన వివిధ విభాగాల పరిపాలన బాధ్యతలు చూస్తుంటారు. రక్షణ మంత్రి నేతృత్వంలోని రక్షణ శాఖ కొనుగోళ్ల మండలిలో, ఎన్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో నడిచే డిఫెన్స్‌ ప్లానింగ్‌ కమిటీలో సీడీఎస్‌ సభ్యునిగా ఉంటారు. అణు కమాండింగ్‌ అథారిటీకి మిలటరీ అడ్వైజర్‌గా ఉంటారు. అయితే, బలగాలకు ఆదేశాలిచ్చే అధికారం సీడీఎస్‌కు ఉండదు.

1978లో గూర్ఖా రైఫిల్స్‌లో చేరిన రావత్‌ 2016 డిసెంబర్‌ 31వ తేదీన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి, మూడేళ్ల పూర్తి కాలం కొనసాగారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆర్మీ చీఫ్‌గా మంగళవారం రిటైర్‌ కావాల్సి ఉంది. ఆర్మీ చీఫ్‌ కాకమునుపు జనరల్‌ రావత్‌ ఈశాన్య రాష్ట్రాలతోపాటు పాక్, చైనా సరిహద్దుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top