నీళ్లు రాని కుళాయిలు.. నోళ్ళు తెరిచిన బోర్లు | Future India with Drinking water shortages | Sakshi
Sakshi News home page

నీళ్లు రాని కుళాయిలు.. నోళ్ళు తెరిచిన బోర్లు

Jun 12 2019 1:22 AM | Updated on Jun 12 2019 2:30 AM

Future India with Drinking water shortages - Sakshi

పొద్దుపొద్దున్నే.. నిద్ర లేవంగానే..కుళాయిలో నీళ్లు రావని తెలిసిందనుకోండి.ఎలా ఉంటుంది? ఎక్కడలేని చికాకు తన్నుకొచ్చేస్తుంది కదూ! మరి.. ఒక రోజుకే అంత ఇబ్బంది పడిపోతే.. వారం పాటు నీళ్లు లేవంటే? నెల గడిచినా చుక్క నీరు దక్కకపోతే? అబ్బో.. ఆ పరిస్థితిని అసలు ఊహించుకోలేం! ఇంకో ఏడాది గడిస్తే.. ఇదే వాస్తవం కానుందని అంటోంది నీతిఆయోగ్‌ నివేదిక ఒకటి!

నీటికోసం ట్యాంకర్ల చుట్టూ వందల వేల బిందెలు.. కుళాయిల వద్ద కొండవీటి చాంతాడంత క్యూ.. నగరాల్లోని బస్తీల్లో, కొన్ని గ్రామాల్లోనూ సాధారణంగా కనిపించే దృశ్యం. జనాభా పెరిగిపోతోంది.. అవసరాలూ ఎక్కువవుతున్నాయి. అందుకే ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని కొంతమంది చెప్పవచ్చుగానీ.. వాస్తవం వేరే ఉంది. భూగర్భంలో దాగున్న జలసిరులు వంద లీటర్లనుకుంటే. మనం వాడుకుంటున్నది 150 లీటర్లు! అందుకే హైదరాబాద్‌ లాంటి నగరాల్లో బోరుబావుల లోతులు ఏటికేటికీ పెరిగిపోతూ వందల అడుగులకు చేరుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లోనైతే ఈ సంఖ్య వెయ్యి కంటే ఎక్కువైపోయింది. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా.. గత నాలుగేళ్లుగా కురిసిన వర్షాలు అరకొరగానే ఉండటంతో ప్రాజెక్టులూ నోళ్లు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ గతేడాది సిద్ధం చేసిన నివేదిక ఒకటి అందరినీ ఆందోళనకు గురిచేసే స్థాయిలో ఉందంటే అతిశయోక్తి ఏమీ కాదు. దీని ప్రకారం.. వచ్చే ఏడాదికల్లా దేశంలోని ప్రధాన నగరాల్లో నీటి సమస్య అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకోనుంది. గత ఏడాది దక్షిణాఫ్రికా నగరం కేప్‌టౌన్‌లో మాదిరిగానే నీటికుళాయిల నుంచి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదన్నది ఈ నివేదిక సారాంశం.

ఇంకేం ఉన్నాయి?
హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలతోపాటు మొత్తం 21 నగరాల్లో తాగునీటి ఎద్దడి గణనీయమైన స్థాయిలో పెరగనుంది. ఫలితంగా ఆయా నగరాల్లోని పేద, బలహీన వర్గాల వారికి సమస్యలు ఎక్కువ కానున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వాననీటి సంరక్షణ, సుదూర ప్రాంతాల్లోని నదుల నుంచి గొట్టాల ద్వారా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. అయితే ఇవేవీ సమస్యను పరిష్కరించవు. ప్రజలు దశాబ్దాలుగా అటు వ్యవసాయానికి, ఇటు దైనందిన అవసరాలకూ భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉండటం దీనికి కారణం. దక్షిణాదిలోనే పది కోట్ల మందికి గుక్కెడు నీరు కూడా దక్కని దారుణ నీటి కటకట ఏర్పడబోతోందని హెచ్చరిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటితే నగరవాసులు ప్రైవేట్‌ కంపెనీలు అక్రమంగా తవ్వితీసే నీటిపై ఆధారపడటం మొదలుపెడతారు. పరిస్థితి మరింత దిగజారిపోయేందుకు ఇదో కారణం కానుంది. దేశంలోని 130 కోట్ల ప్రజల్లో నీటి లభ్యత లేనివారి సంఖ్య 16 కోట్ల పైమాటేనని 2018 నాటి వాటర్‌ ఎయిడ్‌ రిపోర్ట్‌ చెబుతోంది. ఇంతటి దారుణమైన పరిస్థితి ఇంకెక్కడా లేదని ఆ నివేదికలో పేర్కొన్నారు.

డిమాండ్‌ రెట్టింపు
2030 కల్లా దేశంలో అందుబాటులో ఉన్న నీటికి రెండు రెట్లు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడబోతోందని.. ఎద్దడిని అధిగమించేందుకు ప్రజలు పెట్టే ఖర్చు కారణంగా స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతం కోత పడనుందని నీతి ఆయోగ్‌ హెచ్చరించింది. ఒకవేళ కొంతమందికి నీళ్లు అందుబాటులో ఉంటే అది కలుషితాలతో నిండినవే అయి ఉంటాయని.. ఆ నీరు తాగడం ద్వారా అనారోగ్యం పాలై ఏటా 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఉందని తెలిపింది. స్వచ్ఛమైన నీరు లభించే విషయంలో 122 దేశాల జాబితాలో భారత్‌ ర్యాంకు 120 కావడం ఇక్కడ చెప్పుకోవల్సిన విషయం.

ఆహార భద్రతకూ చేటు..
నీటి లభ్యత విషయంలో ఇప్పటికిప్పుడు తగిన చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోకుంటే దాని ప్రభావం దేశ ఆహార భద్రతపై కూడా పడనుంది. రాష్ట్రాలు అందుబాటులో ఉన్న నీటి వనరులను కాపాడుకోవడంతోపాటు అత్యంత సమర్థంగా నీటిని వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న నీరు.. సమర్థ వాడకంపై ఇటీవలే కేంద్రం కాంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌ను సిద్ధం చేసింది. దీని ప్రకారం సమర్థమైన నీటి యాజమాన్య పద్ధతులను పాటించడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మూడోస్థానంలో ఉండగా.. తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అయితే మిషన్‌ భగీరథ, కాకతీయ వంటి పథకాల కారణంగా తెలంగాణ తన పరిస్థితిని వేగంగా మెరుగుపరుచుకుంటోంది. భూగర్భజలాలతో పాటు సాగునీటి వసతులు, వాడకం వంటి 28 అంశాల ఆధారంగా సిద్ధం చేసిన ఈ సూచీలో మొత్తం 24 రాష్ట్రాలకు మార్కులేయగా.. 14 రాష్ట్రాలు 50 కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోనే దాదాపు 60 కోట్ల జనాభా ఉండటం గమనిస్తే.. భవిష్యత్తులో ఏర్పడబోయే నీటి ప్రభావం ఆహార భద్రత, లభ్యతలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

రుతుపవనాల ఆలస్యంతో పరిస్థితి జటిలం..
జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్యలో నైరుతి రుతుపవనాల ద్వారానే 80 శాతం ఉపరితల నీరు మనకు అందుబాటులోకి వస్తుంది. అయితే కొన్నేళ్లుగా సరైన వర్షాల్లేక దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్లో నీరు సగానికిపైగా తగ్గిపోయింది. ఈ ఏడాది కూడా నైరుతి దీర్ఘకాలిక సగటులో 94 నుంచి 96 శాతం వర్షాన్ని మాత్రమే తేనుందన్న సమాచారం ఆందోళన కలిగించే అంశం. 1970తో పోలిస్తే 2015 నాటికి ఖరీఫ్‌ వర్షపాతం 1,050 మిల్లీమీటర్ల నుంచి 1,000 మిల్లీమీటర్లకు తగ్గిపోగా, రబీ వర్షపాతం కూడా 150 నుంచి 100 మిల్లీమీటర్లకు చేరుకుంది. రుతుపవనాల సీజన్‌లో వానలు కురిసే రోజుల మధ్య ఎడం కూడా 40 నుంచి 45 శాతం వరకూ పెరిగిందని వాతావరణ నిపుణుల అంచనా. 

ఏం చేయాలి?
నగరాల్లో పైపులైన్ల ద్వారా సరఫరా అవుతున్న నీరు 30 నుంచి 50 శాతం వృథా అవుతోందన్న అంచనాల నేపథ్యంలో వాటి స్థానంలో కొత్తవాటిని వేసుకోవడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వాడేసిన నీటిని శుద్ధి చేసుకుని దైనందిన అవసరాలకు వాడుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు రీ సైకిల్‌ చేసిన నీటిని అందించడం ద్వారా విలువైన భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు. నగరాల్లో వాననీటి సంరక్షణను విస్తృతంగా చేపట్టడం, ఎండిన బోర్లను వాననీటిని మళ్లీ భూమిలోకి పంపే సాధనాలుగా వాడుకోవచ్చు. దేశంలో సాగునీటి వసతి ఉన్న భూ విస్తీర్ణం 14 కోట్ల హెక్టార్లు కాగా.. ఇందులో కనీసం సగం సూక్ష్మ సేద్యం కిందకు తీసుకు రావాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశం మొత్తమ్మీద బిందు, తుంపర సేద్యాల కింద సాగవుతున్న విస్తీర్ణం 77 లక్షల హెక్టార్లు మాత్రమే కావడం గమనార్హం మిగిలిన భూమిని కూడా బిందు, తుంపర సేద్యాల కిందకు తీసుకొస్తే.. సగటున 50 శాతం సాగునీటిని ఆదా చేయొచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement