నిన్న కార్మికురాలు.. నేడు అధికారి

Fireworks worker Top Fourth Rank in Group One Exams Tamil nadu - Sakshi

పోటీ పరీక్షల్లో సత్తా చాటినబాణసంచా కార్మికురాలు

గ్రూప్‌–1లో మహిళల హవా  

టాప్‌–10లో 8 మందికి చోటు

సాక్షి, చెన్నై: నిన్నటి వరకు బాణసంచా పరిశ్రమలో తండ్రితో కలిసి చేదోడు వాదోడుగా ఉన్న కార్మికురాలు, మరికొన్ని రోజుల్లో ›గ్రూప్‌–1 అధికారి కాబోతున్నారు. గ్రూప్‌–1 ఫలితాల్లో ఆ కార్మికురాలు రాష్ట్రంలోనే టాప్‌–4 స్థానంలో నిలవడం విశేషం. ఇక, ఈ ఫలితాల్లో మహిళల హవా సాగింది.  రాష్ట్రంలో ప్రతి ఏటా పట్టభద్రుల సంఖ్య పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ప్రైవేటు ఉద్యోగాల కోసం ఓ వైపు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం మరో వైపు  అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నిరుద్యోగులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీల భర్తీ నిమిత్తం టీఎన్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తే చాలు లక్షల్లో దరఖాస్తులు దాఖలు కావడం తథ్యం.

ఆ దిశగా గత ఏడాది సబ్‌ కలెక్టర్, డీఎస్పీ సహా ఎనిమిది రకాల పోస్టుల భర్తీకి టీఎన్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. 181 పోస్టులకు  రెండు లక్షల 29 వేల మంది దరఖాస్తులు చేసుకుని పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 9,442 మంది మెయిన్‌కు అర్హత సాధించారు. వీరిలో ప్రస్తుతం 363 మంది ప్రత్యక్ష ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. టాప్‌–10లో ఎనిమిది మంది మహిళలకు చోటు దక్కింది. మొదటి ఆరు ర్యాంకులు మహిళల ఖాతాలో పడ్డాయి.  ఈ ఫలితాలను టీఎన్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇందులో శివగంగైకు చెందిన ఐటీ ఉద్యోగి అర్చన తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ఐటీ ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ గ్రూప్‌ –1 పరీక్ష కోసం తానుపడ్డ శ్రమకు ఫలితం దక్కిందని అర్చన ఆనందం వ్యక్తం చేశారు. సబ్‌ కలెక్టర్‌ కావాలన్నదే తన లక్ష్యంగా పేర్కొన్నారు. ఇక, చెన్నైలోని ప్రముఖ సంస్థలో శిక్షణ పొందిన యురేకా అనే మహిళ రెండో స్థానంలో, ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న ధనలక్ష్మి మూడో స్థానంలో నిలిచారు. అయితే, నాలుగో స్థానాన్ని దక్కించుకున్న మహా లక్ష్మి ప్రస్తుతం అందరి దృష్టిలో పడ్డారు. 

బాణసంచా తయారీలో మహాలక్ష్మి
బాణసంచా కూలీ నుంచి..
విరుదునగర్‌ జిల్లా తిరుకులై గ్రామానికి చెందిన గురుస్వామి, రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె మహాలక్ష్మి. ఈ కుటుంబం కడు పేదరికంలో ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు బాణసంచా పరిశ్రమలో కూలీలు. బాణసంచా తయారీ పరిశ్రమలో పీస్‌ రేటుకు ఇచ్చే వేతనమే ఆ కుటుంబానికి పోషణ. అయినా, ఆ కుటుంబంలోని మహాలక్ష్మి చదువుల తల్లి సరస్వతిగా మారింది. పట్టువదలకుండా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుకుంది. అంతే కాదు, తల్లిదండ్రులతో కలిసి బాణసంచా తయారీలో కార్మికు రాలిగా కూడా పనిచేసింది. ఇప్పుడు ఆమె పడ్డ శ్రమకు, నేర్చుకున్న విద్యకు తగిన ఫలితం తగ్గింది. గ్రూప్‌ –1లో ఆమె టాప్‌ –4 స్థానాన్ని దక్కించుకున్నారు. తనకు ర్యాంకు రావడంతో మహాలక్ష్మి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం లక్ష్యంగా ఇప్పటికే రెండు సార్లు తాను టీఎన్‌పీఎస్సీ పరీక్షలు రాయడం జరిగిందని, ఇది మూడోసారిగా పేర్కొన్నారు. చదివించేందుకు తన తల్లిదండ్రులు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని ఉద్వేగానికి లోనయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top