150 మంది బీజేపీ నేత‌ల‌పై కేసు న‌మోదు

FIR  Filed Against BJP Leader 150 Others For Viloating Rules - Sakshi

కోల్‌క‌తా : లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించారన్న కార‌ణంతో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌హా 150 మందిపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది.  టీఎంసీ కార్య‌క‌ర్తల దాడిలో పశ్చిమ బెంగాల్‌లోని డాంటాన్ ప్రాంతానికి చెందిన బీజేపీ కార్య‌క‌ర్త ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అత‌డికి నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్య‌లో బీజేపీ నేత‌లు హాజ‌రయ్యారు. అంతేకాకుండా అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో టీఎంసీ కార్య‌క‌ర్త‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ బీజేపీ నేత‌లు ప్ర‌సంగించారు. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించ‌డ‌మే కాకుండా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశార‌న్న కార‌ణంతో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు దిలీప్ ఘోష్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌యంత‌న్ బ‌సుతో పాటు మ‌రో 150 మంది బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా ప‌లువురు నేత‌లు క‌నీసం మాస్కులు కూడా ధ‌రించ‌లేద‌ని, వ్య‌క్తిగ‌త దూరం పాటించ‌కుండా పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యార‌ని పోలీసులు తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్ష‌న్‌ 120, 150 కింద కేసులు న‌మోదైన‌ట్లు పేర్కొన్నారు. (కరోనాకు ఇందులో ఏది సరైన మందు? )

దీనిపై ఇరువ‌ర్గాలు విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చేస్తుకున్నాయి. ప‌శ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ టీఎంసీ నాయ‌కుడు మాట్లాడుతూ.. బీజేపీ ఉగ్ర‌వాద భాష మాట్లాడుతుంద‌ని ఆరోపించారు. ఆ పార్టీ నేత‌లు హింస‌ను ప్రోత్స‌హించేలా ప్ర‌సంగాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. శాంతియుత డాంట‌న్ ప్రాంతంలో హింసాత్మక వాతావరణాన్ని సృష్టించడానికి మృత‌దేహాన్ని టీఎంసీ కార్య‌క‌ర్త‌ల ఇళ్ల మీదుగా తీసుకెళ్లార‌ని పేర్కొన్నారు. ఆదివారం ఓ  కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బీజేపీ, టీఎంసీ కార్య‌క‌ర్త‌లు ప‌ర‌స్ప‌రం ఘ‌ర్ష‌ణ‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడిలో ఇరువ‌ర్గాలు తీవ్రంగా గాయ‌ప‌డ‌గా ప‌లువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో బీజేపీ మెర్చా అధ్య‌క్షుడు స‌హా ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నిక‌ల దృష్ట్యా ప‌శ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి మొద‌లైంది. (చైనా నిర్మించినదానికంటే 10 రెట్లు పెద్దది! )

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top