
సాఖేత్ గోఖులే
సుహాస్ గోఖులే.. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగంలో ఓ సీనియర్ పోలీస్ అధికారి. అయితే ఓ డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు నెలపాటు జైలు జీవితం గడిపాడు.
ముంబై: సుహాస్ గోఖులే.. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగంలో ఓ సీనియర్ పోలీస్ అధికారి. అయితే ఓ డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు నెలపాటు జైలు జీవితం గడిపాడు. ఆ అధికారి జైల్లో ఉన్న సమయంలో గత ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా (జూన్ 21 వ తేదీ) అతని కుమారుడు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ఆకట్టుకుంది. ఆ పోస్ట్ కు పదివేల లైక్స్ తో పాటు సుమారు ఎనిమిది వేలకు పైగా షేర్లు వచ్చాయి.'డాడీ.. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వే ఎప్పటికీ నా హీరో' అంటూ కుమారుడు సాఖేత్ గోఖులే పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్ అందర్నీ ఆకట్టుకున్నా.. జైల్లో ఉన్న తండ్రి మాత్రం కుమారుడు వ్యక్తం చేసిన ఆ భావాన్ని మాత్రం చూడలేకపోయాడు.
గత మూడు రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన సదరు పోలీస్ అధికారి తన అరెస్ట్ పై జాతీయ మీడియాతో మాట్లాడాడు. తాను రిటైర్మెంట్ కావడానికి ఒక రోజు ముందు విచారణ నిమిత్తం కొంతమంది అధికారులు అరెస్ట్ చేశారన్నాడు. తన వీడ్కోలు కార్యక్రమం అయిన తరువాత హాజరవుతానన్నా వారు వినలేదని స్పష్టం చేశాడు. ఆ క్రమంలోనే తనను జింఖానా గేట్ వద్ద అరెస్ట్ చేశారన్నాడు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇదిలా ఉండగా ఈ కేసులో చట్టపరంగా సరైన ఆధారాలు లేవంటూ బుధవారం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు రోజుల క్రితం తండ్రిని చూసిన కొడుకు సాఖేత్ తాను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిపాడు. నిజాయితీగా పని చేయడమే చేసిన తప్పా ?అని తండ్రి అడిగిన ప్రశ్నకు తన వద్దే సమాధానమే లేదని సాఖేత్ తెలిపాడు.