
కురుక్షేత్ర : కన్న తండ్రే కాలయముడయ్యాడు. వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. హర్యానాలో కురుక్షేత్ర జిల్లా పెహోవాలోని సర్ససా గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు చిన్నారులు సమీర్(11), సమర్(4), కోడలు సిమ్రాన్(8) ఆదివారం నుంచి కనిపించకుండా పోయారు. తల్లి సుమన్ దేవి ఇచ్చిన సమాచారంతో బంధువు రాజేశ్ మాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనూ మాలిక్, సుమన్ దేవిల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. సోనూ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని సుమన్‌దేవి ఆరోపించారు.
పిల్లల కిడ్నాప్ వ్యవహారంలో అనుమానితులు తండ్రి సోనూ మాలిక్, మరో బంధువు జగదీప్ మాలిక్‌ని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోనూ మాలిక్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో, పిల్లలను మట్టుపెట్టాలని తనకు చెప్పడంతో ఈ నేరాన్ని చేసినట్టు జగదీప్ మాలిక్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పిల్లల మృతదేహాలను పంచకుల అటవీ ప్రాంతంలో వెలికి తీశారు. పిల్లల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.