వెనెజులాలోని మార్గరిటా ఐస్లాండ్ లో 17వ 'నామ్' సదస్సు జరగనున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది.
న్యూఢిల్లీః విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు వెనెజులా నాన్ అలైన్డ్ మూవ్ మెంట్ (నామ్) ఆహ్వానం అందింది. వచ్చేనెల వెనెజులాలో జరిగే నామ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఆయనకు బదులుగా సుష్మా స్వరాజ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
వెనెజులా బొలీవియన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి డెల్సీ రోడ్రిక్వెజ్ 2016 ఆగస్టు 18న ఇండియా సందర్భించారు. వెనెజులాలోని మార్గరిటా ఐస్లాండ్ లో 17వ 'నామ్' సదస్సు జరగనున్న నేపథ్యంలో సమావేశానికి భారతదేశాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు రోడ్రిక్వెజ్ భారత్ కు వచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
2016 సెప్టెంబర్ 17-18 తేదీల్లో నామ్ సదస్సు జరగనుంది. అయితే ఇంతకు ముందు 1979 సంవత్సరం చరణ్ సింగ్ భారత కేర్ టేకర్ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన నామ్ శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత ప్రధాని హాజరు కాలేదు. దీంతో ఈసారి తప్పనిసరిగా భారత ప్రాతినిథ్యం ఉండేందుకు వీలుగా ప్రధానికి బదులుగా సుష్మా స్వరాజ్ హాజరయ్యే అవకాశం ఉంది.