breaking news
NAM Summit
-
నూతన అంతర్జాతీయ వ్యవస్థ కావాలి!
న్యూఢిల్లీ: కోవిడ్–19 అనంతర ప్రపంచంలో నూతన అంతర్జాతీయ వ్యవస్థ రూపొందాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సంస్థల పరిమితులను కరోనా సంక్షోభం ఎత్తి చూపిందన్నారు. అలీనోద్యమ (నామ్) దేశాల నేతలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. నిష్పక్షపాతం, సమానత్వం, మానవత్వం ప్రాతిపదికగా నూతన అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడాల్సి ఉందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే అంతర్జాతీయ వ్యవస్థలు నేటి అవసరం. కేవలం ఆర్థిక అభివృద్ధినే కాకుండా, మానవాళి సంక్షేమాన్ని కాంక్షించే వ్యవస్థలు అవసరం. ఇలాంటి విషయాల్లో భారత్ ఎప్పుడూ ముందుంది’అన్నారు. అలీనోద్యమం దశాబ్దాల పాటు నైతిక భావనలకు గొంతుకగా నిలిచిందన్నారు. మానవాళి అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా ఒక సంఘీభావ ప్రకటన అవసరమని, ఆ దిశగా సమ్మిళిత దృక్పథంతో నామ్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరోనాపై యుద్ధాన్ని భారత్ ప్రజాస్వామ్యయుతంగా, క్రమశిక్షణ, నిర్ణయాత్మకతలతో నిజమైన ప్రజాయుద్ధంగా మలిచిందన్నారు. -
‘ఉగ్ర’ నియంత్రణతోనే శాంతి, భద్రత
నామ్ డిక్లరేషన్‌లో వెల్లడి పోర్లమార్(వెనిజులా): ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అంతమొందించాలని ప్రపంచ దేశాలకు నామ్(అలీన కూటమి) సభ్యదేశాలు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ సమాజంలో శాంతి, భద్రతకు ఇది పెను ముప్పుగా మారిందని, ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చడం, అక్రమంగా ఆయుధాలు సరఫరా చేయడాన్ని నిరోధించాలని కోరాయి. 17వ నామ్ సదస్సు చివరి రోజైన సోమవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ సమావేశాలకు హాజరయ్యారు. మతం,నమ్మకాల ఆధారంగా కొన్ని ఉగ్ర సంస్థలు సాంస్కృతిక, వారసత్వ కట్టడాల విధ్వంసానికి పాల్పడడం, మానవ జాతిపై నేరాలకు ఒడిగట్టడాన్ని కూటమి ఖండించింది. ఉగ్ర సంస్థలు తాలిబన్, ఆల్‌ఖైదా, ఐసిస్ దాని అనుబంధ సంస్థలు జబాత్ అల్ నుర్సా, బోకో హారం, అల్ షబాబా , ఐక్యరాజ్య సమితి గుర్తించిన కొన్ని సంస్థల కార్యకలాపాలు, ఉగ్ర వ్యాప్తికి అవి కల్పిస్తున్న వాతావరణాన్ని గర్హించింది. ఐరాస చార్టర్, ఇతర అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అన్ని దేశాలు మరింత సమర్థంగా, సమన్వయంతో ఈ ముప్పును ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతమున్న ఐరాస ఉగ్ర వ్యతిరేక వ్యూహ అమలు తదితరాలకు అదనంగా భవిష్యత్తులో మరో సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చునే దిశగా కూటమి ఆలోచన మొదలెట్టింది. తీవ్రవాదాన్ని ఏదో ఒక మతం, వర్గం, జాతితో ముడిపెట్టకూడదని, వీటిని తీవ్రవాద కార్యకలాపాలను సమర్థించుకోవడానికి ఉపయోగించుకోకూడదని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ఉగ్ర వ్యతిరేక చర్యల కింద అనుమానితుల వివరాలు బయటపెట్టడానికి, వ్యక్తుల గోప్యతపై దాడికి వాడుకోవద్దని తెలిపారు. ఉగ్ర ముప్పును ఎదుర్కోవాలంటే నిర్దిష్ట చర్యలు అవసరమని, ప్రభావవంత సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని 120 దేశాల బృందాన్ని భారత్ ఆదివారం కోరింది. ఉద్యమానికి సంఘటితమవుదాం అలీన ఉద్యమ పునరుత్తేజం, పటిష్టానికి సభ్య దేశాలు మద్దతును పునరుద్ఘాటించాయి. ఐరాస చార్టర్, అంతర్జాతీయ ఒప్పందాల మేరకు వివాదాలను పరిష్కరించుకోవాలని తీర్మానించాయి. చట్టబద్ధ ప్రభుత్వాలను కూలదోసే అక్రమ విధానాలను తిరస్కరించాయి. ఏదైనా దేశం సమగ్రత, ఐక్యతకు భంగం కలిగించే యత్నాల పట్ల వ్యతిరేకత కొనసాగుతుందని పునరుద్ఘాటించాయి. ఇతర దేశాల సారభౌమత్వాన్ని గౌరవించాలని, వారి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోరాదని, బల ప్రయోగం, బెదిరింపులకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం పనిచేయాలని తీర్మానించాయి. అణు నిరాయుధీకరణ కోసం తక్షణం చర్చలు ప్రారంభం కావాలని పిలుపునిచ్చాయి. శాంతియుత ప్రయోజనాల కోసం అణు విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే దేశాల సారభౌమత్వాన్ని పునరుద్ఘాటించాయి. -
సుష్మాకు 'నామ్' సమ్మిట్ ఆహ్వానం
న్యూఢిల్లీః విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు వెనెజులా నాన్ అలైన్డ్ మూవ్ మెంట్ (నామ్) ఆహ్వానం అందింది. వచ్చేనెల వెనెజులాలో జరిగే నామ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఆయనకు బదులుగా సుష్మా స్వరాజ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వెనెజులా బొలీవియన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి డెల్సీ రోడ్రిక్వెజ్ 2016 ఆగస్టు 18న ఇండియా సందర్భించారు. వెనెజులాలోని మార్గరిటా ఐస్లాండ్ లో 17వ 'నామ్' సదస్సు జరగనున్న నేపథ్యంలో సమావేశానికి భారతదేశాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు రోడ్రిక్వెజ్ భారత్ కు వచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. 2016 సెప్టెంబర్ 17-18 తేదీల్లో నామ్ సదస్సు జరగనుంది. అయితే ఇంతకు ముందు 1979 సంవత్సరం చరణ్ సింగ్ భారత కేర్ టేకర్ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన నామ్ శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత ప్రధాని హాజరు కాలేదు. దీంతో ఈసారి తప్పనిసరిగా భారత ప్రాతినిథ్యం ఉండేందుకు వీలుగా ప్రధానికి బదులుగా సుష్మా స్వరాజ్ హాజరయ్యే అవకాశం ఉంది.