ఓ నిర్ణయానికొచ్చిన ఎన్నికల కమిషన్ | election commission decided on assembly elections of maharashtra | Sakshi
Sakshi News home page

ఓ నిర్ణయానికొచ్చిన ఎన్నికల కమిషన్

Jul 3 2014 10:43 PM | Updated on Oct 8 2018 6:02 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికలను దీపావళికి ముందే నిర్వహించాలని ఎన్నికల సంఘం ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

సాక్షి, ముంబై: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికలను దీపావళికి ముందే నిర్వహించాలని ఎన్నికల సంఘం ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అక్టోబర్ 13 నుంచి 18వ తేదీ లోపు రెండు దశల్లో పూర్తిచేసి ఫలితాలు వెల్లడించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)ల నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం గడువు డిసెంబర్ 7వ తేదీతో ముగుస్తుంది.

హర్యానా ప్రభుత్వం గడువు కూడా అక్టోబర్ 27తో ముగియనుంది. దీంతో ఆలోపే ఇరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలవైపు మళ్లింది. గత పదేళ్ల కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన విషయం తెలిసిందే. ప్రతిపక్ష హోదా కూడా అతికష్టం మీద దక్కించుకున్న కాంగ్రెస్‌కు, తిరుగులేని మెజార్టీ సాధించిన బీజేపీకి  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాలే. దీంతో దేశం మొత్తం కూడా ఈ ఎన్నికలవైపు చూస్తోంది. ఎన్నికల గురించి కమిషన్ ఎటువంటి కసరత్తు మొదలు పెట్టకముందే ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

 కాగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన తతంగమంతా పూర్తి కావడంతో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన ఎన్నికల సంఘం మరో రెండు నెలల్లో పక్కా షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ ఈ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. ఈ నెలాఖరు వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకులతో ఎన్నికల తేదీలపై చర్చలు జరిపి వారి అభిప్రాయాన్ని సేకరించనుంది. అందుకు ముంబైలో ఈ నెల 20వ తేదీన అన్ని రాజ కీయ పార్టీలతో సమావేశం నిర్వహించే అవకాశాలున్నట్లు తెలిసింది. సెప్టెంబర్‌లో గణేశ్ ఉత్సవాలు జరుగనుండడంతో ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించవద్దంటూ ఇదివరకే రాజకీయ పార్టీలతోపాటు సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

 దీంతో  గణేశ్ ఉత్సవాలు ముగిసిన తర్వాత,  దీపావళి ముందు అంటే రెండు పండుగల మధ్యలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ యోచిస్తోందని, అక్టోబర్ 21 నుంచి దీపావళి పండుగ మొదలవుతుండడంతో మహారాష్ట్రలో దీపావళికి ముందే ఎన్నికల తంతు పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో డిసెంబరు 7వ తేదీ గడువు ముగిసేలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినంత సమయం దొరుకుతుందని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.

 కార్యకర్తలను ఉత్తేజపరుస్తాం: తట్కరే
 ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపుతామని ఎన్సీపీ రాష్ట్రాధ్యక్షుడు సునీల్ తట్కరే తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పాల్ఘర్‌లో ఈ నెల 1వ తేదీన కార్యకర్తలతో సమావేశం నిర్వహించామని, 4న అహ్మద్‌నగర్‌లో నిర్వహించనున్నామని, ఆ తర్వాత 5న డోంబివలి, ఠాణేలో,  జల్గావ్‌లో 6న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశాలు సామాన్యులను పార్టీకి దగ్గర చేసేందుకేనని చెప్పారు. కాంగ్రెస్-ఎన్సీపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరిస్తామన్నారు.

వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సమావేశాల ద్వారా అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకుంటామని చెప్పారు. పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు సుహృద్భావ వాతావరణం నెలకొల్పే ప్రయత్నం చేస్తామన్నారు. నేతలు నిజాయతీగా నడుచుకునేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామన్నారు. సమావేశాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలంద రూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చేసేదే ప్రజలకు చెబుతామని, మోడీలాగా కల్లబొల్లి మాటలు చెప్పి మోసగించమన్నారు. మంచి రోజులు ముందున్నాయని చెప్పిన మోడీనుద్దేశించి మాట్లాడుతూ... ‘ఏవి మంచిరోజు లు.. మీరు అధికారంలోకి వచ్చాక ఇంధనం ధరలు పెంచేశారు. రైలు చార్జీలు పెంచేశారు. ఇవేనా మంచిరోజులు?’ అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement