దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది ముస్లింలు సంప్రదాయ దుస్తులు ధరించి తమకు సమీపంలో ఉన్న మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది ముస్లింలు సంప్రదాయ దుస్తులు ధరించి తమకు సమీపంలో ఉన్న మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీ జమామసీదులో గురువారం జరిగిన సామూహిక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలంతా ఈ ప్రార్థనలకు హాజరయ్యారు. ఒకరినొకరు హత్తుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు తమ ఉపవాస దీక్షలను విరమించి పండగ చేసుకుంటున్నారు.
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మక్కామసీద్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెలరోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసదీక్షలు నిర్వహించిన ముస్లిం సోదరులు.. దీక్షలకు పరిపూర్ణ ఫలితం లభించే రంజాన్ పండుగ రోజున సంబరాలు జరుపుకుంటున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆలింగనాలు, కరచాలనాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోనూ ఈద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొని... ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ దుస్తులు ధరించిన పిల్లలు ప్రార్థనా మందిరం వద్ద సందడి చేశారు.