జమ్మూకశ్మీర్‌లో ఈద్‌ ప్రశాంతం

Eid Prayers Peaceful In Kashmir - Sakshi

ఎన్‌ఎస్‌ఏ దోవల్‌ ఏరియల్‌ సర్వే

శ్రీనగర్‌/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో సోమవారం బక్రీద్‌ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. జమ్మూతో పాటు కశ్మీర్‌లోని పలుచోట్ల ముస్లింలు భారీ సంఖ్యలో ఈద్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకోగా, ఆందోళనకారుల్ని భద్రతాబలగాలు చెదరగొట్టాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని కేంద్రం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే.

పండుగ సందర్భంగా మద్దతుదారులతో సందడిగా ఉండే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీల ఇళ్లు ఈసారి మూగబోయాయి. ఫరూక్‌ను గుప్కార్‌రోడ్డులోని ఆయన ఇంట్లోనే హౌస్‌అరెస్ట్‌ చేసిన బలగాలు.. ఆయన కుమారుడు ఒమర్‌ను హరినివాస్‌ ప్యాలెస్‌లో నిర్బంధించాయి. ఇక ముఫ్తీని చష్మా సాహి అనే నివాసంలో ఉంచారు. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించారు. శ్రీనగర్‌తో పాటు దక్షిణ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆర్మీ, పోలీస్‌ ఉన్నతాధికారులూ ఏరియల్‌ సర్వేలో పాల్గొన్నారు. టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్‌ సేవలు మూగబోయిన నేపథ్యంలో కశ్మీరీలు ఇతర రాష్ట్రాల్లోని తమ వారితో మాట్లాడేందుకు పోలీసులు 300 ప్రత్యేక టెలిఫోన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top