భవిష్యత్లో భర్తలు దొరకడం కష్టమే! | Sakshi
Sakshi News home page

భవిష్యత్లో భర్తలు దొరకడం కష్టమే!

Published Thu, Feb 5 2015 11:44 AM

భవిష్యత్లో భర్తలు దొరకడం కష్టమే!

లండన్: యూనివర్సిటీ, కాలేజీ స్థాయి చదువు పూర్తిచేసిన భారతీయ యువతులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం కనుగొన్నారు. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇటీవల చేసిన సర్వేలో ఓ సరికొత్త విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్లో భారతీయ యువతులకు భర్తలు దొరకడం కష్టమేనని ఓ సర్వే తేల్చింది.

యూనివర్సిటీ, కాలేజీ వరకు చదివిన యువతులకు సరైన జీవిత భాగస్వామిని వెతుక్కోవడం 2050 నుంచి కష్టతరం కానుందని సర్వేలో తేలింది. 2050 నుంచి మగవారు తమకంటే తక్కువగా చదువుకున్న వారినే జీవిత భాగస్వాములుగా ఎంపిక చేసుకుంటారని ఈ పరిశోధనలో వెల్లడైంది. ది సెంటర్ ఫర్ డెమోగ్రాఫిక్ స్టడీస్ (బార్సిలోనా), మిన్నెసోటా పాపులేషన్ సెంటర్ (అమెరికా)లు ఈ సర్వేలో భాగం పంచుకున్నాయి.

ప్రస్తుతం ఉన్న పద్ధతులు, ఇతర పరిస్థితులను ఆధారంగా చేసుకుని సర్వే నిర్వహించారు. 45-49 ఏళ్ల వయసున్న అవివాహిత మహిళలు  2010లో 0.07 శాతం ఉండగా, అది 2050కి 9 శాతానికి చేరుకుంటుందని పరిశోధకులు తెలిపారు. చదువుకన్న మహిళలదే ఇందులో అగ్రభాగమని చెప్తున్నారు. తమ కంటే తక్కువగా చదువుకున్న వారినే వివాహం చేసుకోవాలని మగవారు భావించడంతో అవివాహిత మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్ని సర్వేలలో వెల్లడైంది.

జాతీయ కుటంబ ఆరోగ్య సర్వే (భారత్) 2005-06, భారత సామాజిక-ఆర్థిక సర్వే (1999, 2004) వివరాలను పూర్తిగా విశ్లేషించిన ఈ బృందం 50 ఏళ్ల వరకు అవివాహితులైన పురుషులు 1.2 శాతం ఉండగా, మహిళలు 0.6 శాతంగా ఉందని గుర్తించారు. ఈ సర్వేలతో పాటు పురుషులు, మహిళల వయసు, చదువు ఆధారంగా చేసుకుని 2050లో ఉండబోయే పరిస్థితులను తెలిపారు.

2010లో యూనివర్సిటీలో చదువుతున్న పురుషులు 151 మందికి గానూ మహిళలు 100 మంది మాత్రమే ఉన్నరని ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్ అనాలిసిస్, వియన్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోగ్రఫీ సంస్థలు పేర్కొన్నాయి. 2050 ఏడాదికి పురుషులు 92 మాత్రమే ఉండాగా కాలేజీలో చదువుతున్న యువతులు 100 మంది ఉంటారని అంచనాలు వేశారు.

Advertisement
 
Advertisement