‘కార్డుల’పై ఆందోళన వద్దు


వినియోగదారులకు నష్టం జరగనీయమన్న కేంద్రం

 

 న్యూఢిల్లీ: డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా తస్కరణ వివాద పరిష్కారానికి కేంద్రం రంగంలోకి దిగింది. 32.5 లక్షల కార్డుల వివరాలు తస్కరణకు గురైన ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని సదరు బ్యాంకులు, ఆర్బీఐని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఆదేశించారు. వినియోగదారులకు ఎలాంటి నష్టమూ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీఇచ్చారు. కేసును సైబర్ నేరాల్లాగే గుర్తిస్తున్నామని.. ఈ దిశగానే విచారణ ఉంటుందన్నారు. ‘భారతీయ బ్యాంకుల ఐటీ వ్యవస్థ చిత్తశుద్ధి బలమైనది. ఆందోళన చెందాల్సిన పనిలేదు. దీనికి సంబంధించి కేంద్రం సరైన చర్యలు తీసుకుంటుంది.



వినియోగదారులకు నష్టం కలగకుండా చూసుకుంటుంది’ అని ఆర్థిక శాఖ కార్యదర్శి శశికాంత దాస్ వెల్లడించారు. డేటా తస్కరణకు సంబంధించి ప్రాథమిక నివేదిక అందిందని.. పూర్తి నివేదిక రాగానే కార్యాచరణ మొదలవుతుందని ఆయన తెలిపారు. జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం..  ఈ డేటా మోసం ద్వారా19 బ్యాంకుల్లో 641 మంది వినియోగదారులకు సంబంధించిన దాదాపు  రూ. 1.3 కోట్లు చోరీకి గురైంది. 90 ఏటీఎంల ద్వారానే ఈ కార్డులనుంచి డబ్బులు తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. డేటా అతిక్రమణ జరిగిన వాటిలో 26.5 లక్షల కార్డులు ‘వీసా’, ‘మాస్టర్‌కార్డు’లకు చెందినవి కాగా.. 6 లక్షల కార్డులు ’రూపే’ నుంచి జారీ అయినవి. అయితే తమ కార్డుల భద్రత, నెట్‌వర్క్‌ల విషయంలో అలసత్వంగా ఉండే ప్రసక్తే లేదని వీసా, మాస్టర్‌కార్డు తెలిపాయి. ఏటీఎంల ద్వారా లావాదేవీల భద్రతను పర్యవేక్షిస్తున్న హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని వెల్లడించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top