శిక్ష పడితే పైకోర్టుకు వెళ్తున్నారు: వెంకయ్యనాయుడు

Disha Incident Venkaiah Naidu On Crimes Against Women In Rajya Sabha - Sakshi

న్యూఢిల్లీ : కేవలం చట్టాలు చేయడం ద్వారా దిశ వంటి ఘటనలు పునరావృతం కాకుండా అరికట్టలేమని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఇలాంటి హేయమైన నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనపై చర్చకు కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభలో నోటీసు ఇచ్చింది. ఈ క్రమంలో చర్చ సందర్భంగా ఆజాద్‌ మాట్లాడుతూ... ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అరాచకాలు తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలపై వెంటనే దర్యాప్తు చేపట్టి దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి ఘటనల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా కఠినంగా వ్యవహరించినపుడే ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీ మరో ఎంపీ అమీ యాజ్నిక్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ వ్యవస్థలన్నీఒకే తాటిపైకి వచ్చినపుడే సామాజిక సంస్కరణలు జరుగుతాయని పేర్కొన్నారు. మరోవైపు లోక్‌సభలో సైతం దిశ ఘటనపై చర్చకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతినిచ్చారు. క్వశ్చన్‌ అవర్‌ తర్వాత ఈ మేరకు చర్చ జరుగనుంది.  

అప్పుడే న్యాయం: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు
హైదరాబాద్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా మహిళలపై లాంటి ఘటనలు జరుగుతున్నాయి. కేవలం కోర్టులు, చట్టాలతో న్యాయం జరగదు. కింది కోర్టులో శిక్ష పడితే పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్తున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం లభించాలి. ఈ పరిస్థితుల్లో మార్పునకు సమాజమంతా సమిష్టి కృషి చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలు బోధించాలి. అందరి మైండ్‌సెట్‌ మారాలి. జాతీయ రహదారుల్లో మద్యం అమ్మకాలు తగ్గించాలి.

దేశం సురక్షితం కాదు: విజిలా సత్యనాథ్‌
‘ఈ దేశం మహిళలకు, చిన్నారులకు సురక్షితం కాదు. న్యాయం ఆలస్యం కావడం అంటే అన్యాయం జరిగినట్లే. వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలి. దిశ హత్య కేసులో నలుగురిని డిసెంబరు 31లోగా ఉరి తీయాలి’ అని అన్నాడీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్ డిమాండ్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top