దేవదాసీలపై దర్శకుడి వ్యాఖ్యలు సబబేనా?

Director Pa Ranjith Sensational Comments Devadasi System - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజరాజ చోళుడు–1 దళితుల భూములను లాక్కున్నారని, దేవదాసీల వ్యవస్థను పటిష్టం చేశారని ఆరోపించడం ద్వారా కబాలి, కాలా చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ తమిళ దర్శకుడు పా. రంజిత్‌ చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయనపై ‘హిందూ మక్కాల్‌ కాట్చీ (హిందూత్వ సంస్థ)’ ఫిర్యాదు చేయడంతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలతో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలవడం, రంజిత్‌ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టులో ప్రస్తుతం వాదోపవాదాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ నెల 17వ తేదీ వరకు ఆయన్ని అరెస్ట్‌ చేయరాదంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ వీగిపోతే ఆయన్ని అరెస్ట్‌ చేయవచ్చు. 

కేసు విషయాన్ని పక్కన పెడితే రంజిత్‌ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాస్తవాలు ఏమిటీ ? అసలు రాజరాజ చోళుడు ఎవరు ? ఏ కాలం నాటి వారు ? గత ఐదు దశాబ్దాలుగా తమిళనాడులోని కొన్ని కులాలు ఆయన వారసులుగా ఎందుకు చెలామణి అవుతున్నాయి ? క్రీ.శకం 848 నుంచి 1070 క్రీ.శకం వరకు తమిళ ప్రాంతంలో చోళుల సామ్రాజ్యం కొనసాగింది. విజయాలయ చోళుడు ఆ వంశానికి చెందిన తొలి రాజుకాగా, అతిరాజేంద్ర చోళుడు ఆఖరివాడు. వీరిలో గొప్ప రాజుగా కీర్తిపొందిన వారు రాజరాజ చోళుడు–1. పలు ఆలయాలను నిర్మించడంతో ఆయనకు ఆ పేరు వచ్చింది. తంజావూరులోని బహాదీశ్వర ఆలయం (శివాలయం)ను నిర్మించినది ఆయనే. 

థేవర్లు, నాదర్లు, వన్నియార్లు, వెల్లాలార్లు వారసులట!
రాజరాజ  చోళుడి వారసులమని దక్షిణ తమిళనాడులో బలమైన ఓబీసీలుగా ఉన్న థేవర్లు, నాదర్లు, ఉత్తర తమిళనాడులోని ఓబీసీల్లో బలమైన వన్నియార్లు, ఎస్సీలైన దేవేంద్ర కుల వెల్లాలార్లు గత ఐదారు దశాబ్దాలుగా చెప్పుకుంటున్నారు. ప్రతి ఏటా అక్టోబర్‌ నెలలో ఈ కులాల వారు చోళుడి జయంతిని ఘనంగా జరుపుకుంటారు. తామే అసలైన వారసులమంటూ రాష్ట్రమంతట పోస్టర్లు వేస్తారు. వీరిలో ఎవరు అసలు వారసులో తేల్చేందుకు ఎలాంటి చారిత్రక ఆధారాలు అందుబాటులో లేవు. రాజరాజ చోళుడి గురించి ‘పొన్నీయిన్‌ సెల్వన్‌’ పేరిట ఐదు సంపుటాలు రాసిన కల్కి క్రిష్ణమూర్తి కూడా ఆయన వారసుల గురించి పేర్కొనలేదు. 1950లో ‘పొన్నీయిన్‌ సెల్వన్‌’ ఓ తమిళపత్రికలో ఓ ధారావాహిక సీరియల్‌గా రావడంతో ఆయన గురించి ప్రతి ఇంటా తెల్సిపోయింది. ఆ తర్వాత వారసుల తగువు మొదలైనట్లు తెలుస్తోంది. 

దళితుల భూములను లాక్కున్నారా ?
రాజరాజ చోళుడి హయాంలో బ్రాహ్మణులది అగ్రస్థానమని, ఆయన బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను దానం చేశారని వాటిని ‘బ్రహ్మదేయ’ అని వ్యవహరించేవారని తమిళనాడు నుంచి 28 వేల రాజ శిలా శాసనాలను సేకరించి వాటిపై పరిశోధనలు జరిపిన జపాన్‌ చరిత్రకారుడు నొబోరు కరషిమ తెలిపారు. బ్రాహ్మణులు నేరం చేస్తే చిన్న శిక్షలు, ఇతరులు నేరం చేస్తే పెద్ద శిక్షలు ఉండేవని కూడా పేర్కొన్నారు. అందుకనే పెరియార్‌ ఈవీ రామస్వామి తన రచనల్లో చోళులను తీవ్రంగా విమర్శించారు. అయితే రాజరాజ చోళుడి తర్వాత అధికారంలోకి వచ్చిన రాజులు బ్రాహ్మణులతోపాటు దళితులకు భూదానం చేశారని అప్పట్లో వ్యవసాయం చేసుకునే ‘పెరియార్ల’కు పన్ను మినహాయింపు కూడా ఇచ్చారని 2012లో విడుదలైన ‘చోళకళ సెప్పెదుగల్‌’లో ఎం. రాజేంద్రన్‌ (ఐఏఎస్‌) పేర్కొన్నారు. అయితే దళితుల వద్ద భూమి గుంజుకున్నట్లు ఆయన ఎక్కడా తెలపలేదు. అలాంటి ఆధారాలు కూడా లేవని కోల్‌కతాలోని ‘సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ సోషల్‌ సైన్సెస్‌’లో పొలిటికల్‌ సైన్స్‌ అసెస్టెంట్‌ ప్రొఫెసర్‌ కార్తీక్‌ రామ్‌ మనోహరన్‌ కూడా స్పష్టం చేశారు. 

మరి దేవదాసీల సంగతి 
దేవుళ్లకు దాస్యం చేసే దేవదాసీ వ్యవస్థను అప్పట్లో తమిళనాట ‘దేవరదియాల్‌’గా వ్యవహరించేవారు. క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు పాలించిన పల్లవ రాజుల కాలంలో ఈ వ్యవస్థ వచ్చింది. తమిళ దర్శకుడు రంజిత్‌ ఆరోపించినట్లుగా రాజరాజ చోళుడు హయాంలో బలేపేతం అయింది. ఆయన కాలంలో వివిధ దేవాలయాలకు దాదాపు 400 దేవదాసీలు ఉండేవారు. అనాథలు, అభాగ్యులైన ఆడ పిల్లలను దేవదాసీలుగా కొనుగోలు చేసేవారు. వారు కేవలం దేవాలయాలను శుభ్రం చేయడానికే పరిమితం అయ్యేవారు. అక్కడ భోంచేసి, అక్కడే పడుకుంటూ తమ జీవితాలను ఆలయాలకు అంకితం చేసేవారు. వారికి ప్రత్యేక గదులను కట్టించిన ఘనత రాజరాజ చోళుడిదే. ఇక్కడ రంజిత్‌ విమర్శ అర్థరహితం. లైంగికంగా దేవదాసీలను ఉపయోగించుకోవడం 18వ శతాబ్దంలో మొదలై, 19వ శతాబ్దంలో బలపడినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top