డిప్లమో ఇంజినీర్ల సమావేశం

Diploma Engineers Conference - Sakshi

రాయగడ : తమ కోర్కెలను ప్రభుత్వం ఆమోదించినప్పటికీ  నేటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఒడిశాలోని డిప్లమో ఇంజినీర్లు, డిగ్రీ ఇంజినీర్లు  రాష్ట్ర డిప్లమో ఇంజినీర్ల అసొసియేషన్‌ అదేశాల మేరకు  రాయగడ ఐబీలో మంగళవారం సమావేశమయ్యారు.  సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షుడు రమకాంత్‌దాస్, సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌ పాత్రో, సభ్యులు సుచిత్రామోహన్‌ తదితరులు మాట్లాడుతూ  చాలా కాల క్రితం ప్రభుత్వం ఆమోదించిన  8కోర్కెలు నేటికీ అమలు కాలేదని దీనిపై రాష్ట్రంలో 8,500 మంది డిప్లమో ఇంజినీర్లు  సెప్టెంబర్‌ 18వతేదీ నుండి అక్టోబర్‌ 31వతేదీ వరకు సామూహిక సెలవు ఆందోళన చేపట్టనున్నట్లు నిర్ణయించామని  వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ విభాగంలో జూనియర్‌ ఇంజినీర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చట్ట ప్రకారం 6సంవత్సరాలు పని చేసిన కాంట్రాక్టు బేస్డ్‌ డిప్లమో ఇంజినీర్లను   పర్మినెంట్‌ చేయవలసి ఉందని, 17సంవత్సరాలుగా పర్మినెంట్‌ చేయకపోవడంతో డిప్లమో ఇంజినీర్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇద్దరు నోడల్‌ అధికారులతో ఇబ్బందులు

అలాగే 1279మంది డిగ్రీ ఇంజినీర్లను పర్మినెంట్‌ చేయవలసి ఉందని, 22సంవత్సరాలుగా వారి ఉద్యోగాలు క్రమబద్ధీకరణకు నోచుకోలేదని వాపోయారు. గతంలో అసిస్టెంట్‌ ఇంజినీర్లకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజీనీర్లుగా ప్రమోషన్లు ఇచ్చినా అమలు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజినీర్ల సమస్యలను పరిష్కరించే నోడల్‌ అధికారి ఒకరు గతంలోఉండేవారని ప్రస్తుతం ఇద్దరు నోడల్‌ అధికారులను విభజించి ప్రభుత్వం నియమించడం వల్ల డిగ్రీ, డిప్లమో ఇంజినీర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.  ఇంజినీర్లకు నేరుగా వైద్య సదుపాయాలు కల్పించాలని డిప్లమో ఇంజీనీర్లు, డిగ్రీ ఇంజినీర్లకు రూ.4,600 పేస్కేల్‌ ఇవ్వాలని,  పోస్టులు రెగ్యులర్‌ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top