‘సల్మాన్‌’ ఉసురు తీసిన టిక్‌-టాక్‌

Delhi Man Killed After Pistol Goes Off While Filming TikTok Video - Sakshi

జిమ్మిక్కుల సెలెంట్‌ కిల్లర్‌, మొబైల్‌ యాప్‌ టిక్‌-టాక్‌ వీడియోల వెర్రి యువత ప్రాణాలు తీస్తోంది. సోషల్ మీడియాలోఈ వీడియోల మోజు వికటించి అనేక దుష్పరిణామాలకు దారితీస్తోంది. దీనిపై ఒకవైపు ఆందోళన కొనసాగుతుండగానే ఢిల్లీలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. టిక్‌టాక్‌ వీడియో తీస్తూ ప్రాణ స్నేహితుడి ఉసురు తీసిన వైనం కలకలం రేపింది. 

సల్మాన్‌, సొహైల్‌, అమీర్‌ ముగ్గురూ స్నేహితులు. ఆదివారం సాయంత్రం ముగ్గురు కారులో ఇండియా గేట్‌ వరకూ వెళ్లారు. అలా ఆ సాయంత్రం సరదాకి గడిపిన అనంతరం ముగ్గురూ తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఇంతలో టిక్‌-టాక్‌వీడియో తీసుకోవాలని కోరిక పుట్టింది సొహైల్‌కు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కారు డ్రైవ్‌ చేస్తున్న సల్మాన్‌ (19) పై గురిపెడుతూ.. టిక్‌-టాక్‌వీడియో తీయడానికి ప్రయత్నించాడు పక్క సీట్లో కూర్చున్న సొహైల్‌. కానీ దురదృష్టవశాత్తూ తుపాకి గుండు సల్మాన్‌ కుడి కణత భాగంలోకి చొచ్చుకుపోయింది. రక్తపు మడుగులో కుప్పకూలిన సల్మాన్‌ను చూసి  వెనక సీట్లో అమీర్‌ సహా, సొహైల్‌ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే  స్నేహితుడికి ఇంటికి వెళ్లి  రక్తపు మరకల బట్టలను మార్చుకుని.. సల్మాన్‌ను  సమీపంలోని ఎల్‌ఎన్‌జెపీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఇంతలోనే సొహైల్‌, అతని స్నేహితులు  అక్కడినుంచి పారిపోయారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.  అలా విషయం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ ఢిల్లీ బరఖాంబ రోడ్డుకు సమీపంలో ని రంజిత్ సింగ్ ఫ్లైఓవర్ సమీపంలో ఈ సంఘటన  చోటు చేసుకుంది. 

ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందుకున్నపోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకోసం తరలించారు. సల్మాన్‌, అతని స్నేహితుడు షరీఫ్‌లను అదుపులోకి తీసుకున్నామని  పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హత్య, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టామన్నారు.  

కాగా న్యూ జఫర్‌బాద్‌ ప్రాంతంలో నివసించే సల్మాన్‌ తండ్రి వ్యాపారవేత్త అని సల్మాన్‌ బంధువు తెలిపారు. అండర్-గ్రాడ్యుయేట్ విద్యార్థి సల్మాన్ కుటుంబంలో చిన్నవాడు. అతనికి సోదరుడు, సోదరి ఉన్నారు. టిక్-టాక్ వీడియోల క్రేజ్‌లో మునిగి, వీడియోలను  అప్‌లోడ్ చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top