దళితుల కోసం జీవితం అంకితం 

Dedicated life for Dalits - Sakshi

కేరళ యువతి త్యాగనిరతి  

‘ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్‌’ అనే మాటను ఆచరణాత్మకంగా చేసి చూపారు సుధావర్గీస్‌. నారీ గుంజాన్‌ స్వచ్ఛంద సంస్థను స్థాపించి దళితులకు తన జీవితాన్ని అంకితం చేశారు. వారి వికాసం కోసం ఒకవైపు పాటుపడుతూనే మరోవైపు వారి హక్కుల సాధనే శ్వాసగా జీవనం సాగిస్తున్నారు.   కేరళలోని కొట్టాయంకు చెందిన సుధా వర్గీస్‌ మూడు దశాబ్దాల కిందట బిహార్‌లో స్థిరపడ్డారు. ఈ రాష్ట్రంలో  ముసహరాలుగా పిలిచే దళితుల వికాసమే లక్ష్యంగా ఆమె పని చేస్తున్నారు. యుక్తవయస్సులో ఉండగా బిహార్‌కు వెళ్లిన సుధకు అక్కడి కులవ్యవస్థ గురించి తెలిసింది అంతంతమాత్రమే. ఆరంభంలో ఆమెకు ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వాటిని లెక్కచేయలేదు. భాష అర్థమవకపోవడంతో పట్టుదలతో మెల్లమెల్లగా నేర్చుకున్నారు. ముసహరాల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో న్యాయవాద డిగ్రీ చదివారు. దీంతో న్యాయపరమైన అడ్డంకులను అధిగమించడం ఆమెకు మరింత సులువైంది. ఆ తర్వాత ముసహరాల సాధికారత కోసం చెమటోడ్చారు. 1987లో నారీ గుంజాన్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దళిత మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించారు. 2005లో పట్నా శివారులోని దానాపూర్‌లో దళిత బాలికల కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాల నెలకొల్పారు. దానికి ప్రేరణ అని నామకరణం చేశారు. ఆర్థిక సమస్యల కారణంగా కూలీకి వెళుతున్న బాలికలకు ఉచితంగా విద్యాబోధన చేశారు.

నారీ గుంజాన్‌ సంస్థ ప్రస్తుతం బిహార్‌లోని ఐదు జిల్లాల్లో పనిచేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 850 స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ గ్రూపులు అంగన్‌వాడీ పాఠశాలలనూ నడుపుతున్నాయి. వయోజన విద్యా కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఆమె అంకితభావం గురించి తెలియడంతో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ గయలోనూ ఇలాంటి పాఠశాలను నెలకొల్పాల్సిందిగా కోరారు. దానాపూర్, గయల్లోని రెండు పాఠశాలల్లో ప్రస్తుతం మూడు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరోవైపు నారీ గుంజాన్‌ సంస్థ యువతకు సంగీతం, క్రీడలు, నాట్యం, కళలు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చింది. ఆయా విభాగాల్లో తర్ఫీదు పొందిన యువతీయువకులు దేశ, విదేశాల్లో నిర్వహించిన అనేకపోటీల్లో పాల్గొని సత్తా చాటారు.  సుధ 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందారు.  ‘ఏదో ఒకటి చేయాలనిపించింది’   ఈ విషయమై సుధ మాట్లాడుతూ ‘ముసహరాలతో పరిచయమయ్యేదాకా అస్పృశ్యత, వివక్ష అనే పదాలు నాకు కొత్త. వారికి ఏదో ఒకటి చేయాలనిపించింది. దీంతో వారి ఇళ్ల వద్దే నివాసం ఏర్పరుచుకున్నా. వారి హక్కుల కోసం పోరాడుతున్నా. వారి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటా’ అని అన్నారు.  
–సాక్షి, స్టూడెంట్‌ ఎడిషన్‌ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top