
వాట్సాప్‌లో పోస్టు చేసిన సీఆర్‌పీఎఫ్ జవాన్ నాగేశ్వరరావు
సాక్షి, ఒడిశా(డెంకాడ): జమ్ముకశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న డెంకాడ మండలంలోని మోపాడకు చెందిన నాగేశ్వరరావు తనకు జరిగిన అన్యాయాన్ని వాట్సాప్ ద్వారా బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. నాగేశ్వరరావు తండ్రి లక్ష్మణకు చెందిన భూమిని గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బంటుపల్ల మురళీ కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడని.. అడిగితే తన తండ్రిపై దాడులు చేశాడని నాగేశ్వరరావు వాట్సాప్ ద్వారా తెలియజేశాడు. అలాగే దాడిలో గాయపడిన తన తండ్రి ఫొటో కూడా వాట్సాప్‌లో పోస్టు చేసి అందరికీ పంపించాడు. ప్రస్తుతం ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
మురళికి రాజకీయ పలుకుబడి ఉండడంతో తమకు ఎవ్వరూ న్యాయం చేయడం లేదని కానిస్టేబుల్ నాగేశ్వరరావు వాపోయాడు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే మర్యాదగా కేసు వాపస్ తీసుకో..లేదంటే మీ నాన్నను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు.. ప్రభుత్వ ఉద్యోగినైన నన్ను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. విషపూరిత కుట్రల నుంచి నన్ను, నా కుటుంబాన్ని కాపాడాలంటూ కోరుతున్నాడు. ఇదే విషయమై డెంకాడ హెచ్‌సీ అప్పారావు వివరణ కోరగా రెండు నెలల కిందట నాగేశ్వరరావు తండ్రి లక్ష్మణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోపాడ ఎంపీటీసీ సభ్యుడు మురళీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. రెండు రోజుల కిందట చిన్నపాటి వివాదం ఏర్పడితే ఇరువురికి సర్దిచెప్పి పంపించామన్నారు.