కరోనా మరణం: ‘ఆ కుటుంబాన్ని క్వారంటైన్‌లో పెట్టాం’

Covid 19 First Fatality His Family Quarantine In Karnataka - Sakshi

సాక్షి, బెంగుళూరు: దేశంలో తొలి కరోనా మరణం సంభవించడంతో ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ సిద్ధఖీ (76)  కోవిడ్‌ లక్షణాలతో బాధ పడుతూ బుధవారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వైరస్‌ ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సిద్దఖీ కుటుంబ సభ్యులు ఎనిమిది మందిని కలబుర్గిలోని ఓ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో క్వారంటైన్‌ (నిర్భంధం)లో ఉంచింది. సిద్ధఖీ కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, వారి నలుగురు పిల్లలు కలబుర్గిలోని ప్రభుత్వ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉన్నారని కలబుర్గి డిప్యూటీ కమిషనర్‌ బి.శరత్‌ తెలిపారు. 
(చదవండి: భారత్‌లో తొలి మరణం)

పిల్లల్ని మినహాయించి నలుగురు పెద్దవాళ్ల నమూనాలను బెంగుళూరు వైరాలజీ రిసెర్చ్‌ సెంటర్‌కు పంపించామని తెలిపారు. దగ్గు, జలుబుతో వారు బాధ పడుతున్నారని పేర్కొన్నారు.  వారి ఇంటినీ ఇప్పటికే పూర్తిగా శుద్ధి చేశామని చెప్పారు. ఆ ఇంటి పక్కనే ఉన్న మరో కుటుంబానికి చెందిన ఏడుగురిని కూడా ఐసోలేషన్‌ వార్డుకు తరలించామని శరత్‌ వెల్లడించారు. ఫిబ్రవరి 29న సిద్దఖీ సౌదీ నుంచి స్వదేశానికి రాగా.. వారి కుటుంబాన్ని కలిసిన 32 మందిని కూడా ఇంట్లోనే ఉండాలని సూచించినట్టు ఆయన తెలిపారు. ఇక కరోనా భయాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని షాపింగ్‌ మాళ్లు, సినిమా థియేటర్లు, నైట్‌ క్లబ్బులు, పబ్బులను వారంపాటు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది.
(ఐపీఎల్‌ 2020 వాయిదా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top