1,823 కేసులు.. 67 మంది మృతి

COVID-19: 1823 new cases reported And total cases rises to 33610 - Sakshi

విదేశాల్లోని భారతీయుల కోసం నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను సిద్ధం చేశామన్న కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య గురువారానికి 1,075కు చేరుకోగా కేసుల సంఖ్య 33,610కు పెరిగింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 67 మంది చనిపోగా కొత్తగా 1,823 కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 24,162 కాగా 8,372 మంది వైరస్‌ బారిన పడి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన జాబితాలో మహారాష్ట్రలో 32 మంది, గుజరాత్‌ 16, మధ్యప్రదేశ్‌ 11, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు, తమిళనాడు, ఢిల్లీల నుంచి ఇద్దరేసి చొప్పున ఉన్నారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు అత్యధికంగా 432 మంది, గుజరాత్‌లో 197 మంది, మధ్యప్రదేశ్‌లో 130, ఢిల్లీలో 56 మంది, రాజస్తాన్‌లో 51 మంది, ఉత్తరప్రదేశ్‌లో 39 మంది, తమిళనాడులో 27 మంది, బెంగాల్‌లో 22 మంది, కర్ణాటకలో 21 మంది, పంజాబ్‌లో 19 మంది చనిపోయారు.  

60వేల మందిని పంపించాం
72 దేశాలకు చెందిన 60వేల మందిని స్వదేశాలకు పంపించినట్లు హోం శాఖ తెలిపింది. అదేవిధంగా, విదేశాల్లో చిక్కుబడిన భారతీయులను రప్పించేందుకు ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామనీ, ఈ విషయంలో అక్కడి దౌత్య సిబ్బంది అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది. మన దేశంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత గల్ఫ్‌తోపాటు ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకు వచ్చేందుకు నేవీ, వైమానిక దళం సహకారం తీసుకుంటామని హోంశాఖ వెల్లడించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top