నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ మసీదు మూసివేత

Coronavirus: Nizamuddin Markaz Masjid Sealed - Sakshi

మసీదుకు సీల్‌ వేసిన ఢిల్లీ అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ మసీదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మర్కజ్‌లో ఈ నెల నిర్వహించిన మతపరమైన ప్రార్థనాల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్‌ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మసీదును అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశాల మేరకు మసీదుకు సీల్‌ వేశారు. అలాగే మర్కజ్‌లో ప్రార్థనలు నిర్వహించిన మతపెద్దలపై పోలీసు కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో మర్కజ్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. డ్రోన్‌ కెమెరాలతో అక్కడి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. (తెలంగాణలో కరోనా కల్లోలం)

కాగా మర్కజ్‌ ప్రార్థనలకు ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, నేపాల్‌, మలేషియా, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన దాదాపు 280 మంది హాజరయ్యారు. దీంతో ఆ ప్రార్థనలో పాల్గొన్న వారికి వైరస్‌ సోకే అవకాశం ఉందని ఢిల్లీ వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలుగుచూసిన కరోనా మూలాలు ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. దీనిలో తెలంగాణకు చెందిన ఆరుగురు, కశ్మీర్‌కు చెందిన ఒకరు మరణించడంతో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది.

మరోవైపు ప్రార్థనల్లో పాల్గొన్న 1200 మందికిపైగా కరోనా అనుమానితులను అధికారులు క్వారెంటైన్‌ను తరలించారు. వీరిలో ఇప్పటి వరకు 24 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని ప్రభుత్వ కోరుతోంది. ఇక ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారి కోసం అధికారులు జల్లెడపడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top