కాలర్‌ ట్యూన్‌.. కరోనా ట్యూన్‌ అయింది

Corona virus: Default Audio message As mobile caller Tune - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌... ఇప్పుడు సెల్‌ ఫోన్లకు తాకిందా?. అదేంటి సెల్‌ ఫోన్లకు కరోనా వైరస్‌ అనుకుంటున్నారా?. ఈ వైరస్‌ గురించి, నివారణ చర్యలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి కేంద్ర వైద‍్య ఆరోగ్య శాఖ ఓ అడుగు ముందుకు వేసింది. మీరు ఎవరికైనా ఫోన్‌ చేస్తే ముందుగా ...దగ్గుతున్న శబ్దం..  ఆ తర్వాత దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేతులు శుభ్రం చేసుకోవడం, జన సమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండటం వంటి సూచనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం 30 సెకన్ల నిడివి గల ఓ ఆడియో క్లిప్‌ను రూపొందించింది. (కరోనా భయం వీడి.. మానవత్వం చాటారు)

మీరు ఎవరికి ఫోన్‌ చేసినా ముందుగా దగ్గు, ఆ తర్వాత జాగ్రత్తలు పాటించడనే సందేశాన్ని వినిపిస్తోంది. ఏ మొబైల్‌ వినియోగదారుడైనా ఈ సందేశం వినకుండా తప్పించుకునే వీలు లేకుండా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలిచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలా అన్ని ఫోన్లకూ ఒకే కాలర్‌ ట్యూన్‌ వచ్చిన దాఖలాలు లేవు. దీంతో పలువురు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొందరికి ఫోన్‌ చేస్తే మాత్రం మాములుగానే రింగ్‌ సౌండ్‌ వినిపిస్తోందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు.

 (కరోనా జయించాడు.. రికార్డు సాధించాడు!)

రోజుకు ఓ 20 ఫోన్‌ కాల్స్‌ చేస్తే... ప్రతిసారి ఈ కాలర్‌ ట్యూన్‌ను వినాల్సిందేనా అని పలువురు వాపోతున్నారు. మరోవైపు కరోనా ట్యూన్‌పై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అంతేకాకుండా కరోనా సందేశం వినిపించకుండా ...ఏం చేయాలనే దానిపై సుచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు కొందరు. అయితే కరోనా ట్యూన్‌ తమ ప్రాణానికి వచ్చిందిరా బాబు అంటూ కొంతమంది విసుక్కుంటున్నారు కూడా. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 45 కరోనా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. (వాటి కారణంగానే కోవిడ్ వ్యాప్తి!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top