
నాణ్యమైన న్యాయ సేవలను అందించాలంటే చట్టాలపై అవగాహన, సాంకేతికత అందుబాటులో ఉండటం ముఖ్యమని సీజేఐ అన్నారు.
నాగ్‌పూర్: ప్రజలు తమ హక్కులు, ప్రయోజనాల విషయంలో మోసపోతుండటానికి, దోపిడీకి గురవుతుండటానికి మూల కారణం వారికి చట్టాలపై, న్యాయ వ్యవస్థపై అవగాహన లేకపోవడమేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ ఆదివారం చెప్పారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ప్రజలకు హక్కుల గురించి, స్వీయ రక్షణ గురించి అవగాహన కల్పించాలని అన్నారు.
నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారత రాష్ట్రాల న్యాయ సేవల సంస్థల సమావేశంలో జస్టిస్ గొగోయ్ మాట్లాడారు. అందరికీ న్యాయాన్ని, సంక్షేమ పథకాల ఫలాలను అందించేందుకు, పేదలపై సామాజిక వివక్షను తొలగించేందుకు న్యాయ సేవల సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన న్యాయ సేవలను అందించాలంటే చట్టాలపై అవగాహన, సాంకేతికత అందుబాటులో ఉండటం కూడా ముఖ్యమన్నారు.