చైనా మైండ్‌ గేమ్‌

China mind game over release of 10 Indian soldiers after Galwan valley clash - Sakshi

గాయపడిన 10మంది సైనికుల అప్పగింతలో జాప్యం

మూడు రోజులు విస్తృతంగా చర్చించిన భారత్‌

న్యూఢిల్లీ: భారత్, చైనా ఘర్షణల్లో డ్రాగన్‌ దేశం చేసిన అరాచకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. జూన్‌ 15 రాత్రి హింసాత్మక ఘటనల తర్వాత గాయపడిన మన దేశ జవాన్లను అప్పగించడంలో చైనా తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. మొత్తం 10 మంది సైనికుల్ని తమ నిర్బంధంలో ఉంచుకున్న చైనా భారత్‌కు అప్పగించడానికి మీన మేషాలు లెక్కించింది. చివరికి మూడు రోజుల తర్వాత వారిని అప్పగించింది. ఈ వివరాలను ఆర్మీ అధికారి ఒకరు జాతీయ చానెల్‌తో పంచుకున్నారు. జూన్‌ 15 రాత్రి ఇరు దేశాల మధ్య భీకరమైన పోరాటం జరిగాక అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం నెలకొంది.

అప్పటికింకా వెలుగు రేఖలు విచ్చుకోలేదు. ఒకవైపు గల్వాన్‌ నదిలో నిర్జీవంగా మారిన అమరవీరులు, మరోవైపు తీవ్రంగా గాయపడి నేలకొరిగిన జవాన్లతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆ చీకట్లోనే ఇరువైపులా సైనికులు తమ తోటివారి కోసం వెతుకుతున్నారు. కల్నల్‌ స్థాయి అధికారి సహా ఇతర చైనా సైనికుల్ని మరుక్షణంలోనే భారత్‌ ఆ దేశానికి అప్పగించింది. కానీ చైనా వారి భూభాగంలో గాయపడిన 50 మంది భారత్‌ సైనికుల్ని 24 గంటల తర్వాతే అప్పగించింది. మరో నలుగురు అధికారులు సహా 10 మంది సైనికుల్ని తమ దగ్గర నిర్బంధించింది.

మూడు రోజులపాటు చర్చలు
మన ఆర్మీ సిబ్బంది పదుగురిని క్షేమంగా వెనక్కి తెచ్చుకోవడానికి భారత్‌ ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. మూడు రోజులు చైనా అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఆ పది మంది సైనికులు తమ వద్దే ఉన్నారని చెప్పిన చైనా వారిని అప్పగించడానికి ఆలస్యం చేస్తూ వచ్చింది. చర్చల సందర్భంగా సైనికుల్ని అప్పగించడానికి ఏదో వంక చెప్పేది. చివరికి ఎలాగో జూన్‌ 18న విడుదల చేసింది.

చైనా ఎందుకిలా చేసింది?
మూడు రోజుల పాటు తమ దగ్గరే చైనా ఎందుకు వారిని ఉంచింది ? విడుదల చేయడంలో ఎందుకీ జాప్యం ? అన్న ప్రశ్నలకు మన ఆర్మీ సైనికులు అదంతా చైనా మైండ్‌ గేమ్‌లో భాగం అని అంటున్నారు. భారత్‌ అలా నిరీక్షిస్తే మానసికంగా బలహీనంగా మారుతుందని తద్వారా చర్చల్లో పైచేయి సాధించవచ్చునని చైనా కుయుక్తులు పన్నిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ సరిహద్దుల్లో నివురుగప్పిన నిప్పులాగే పరిస్థితులు ఉన్నాయి. పాంగాంగ్‌ లేక్‌ ద్వారా చైనా ఏ క్షణమైనా మనపై విరుచుకుపడే అవకాశాలున్నాయి. చైనా ఏ రకమైన కుట్ర పన్నినా ఎదుర్కోవడానికి భారత్‌ బలగాలు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్టుగా ఆర్మీ వర్గాలు వివరించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top